పింఛన్‌ ఆశలపై నీళ్లు! | - | Sakshi
Sakshi News home page

పింఛన్‌ ఆశలపై నీళ్లు!

Sep 16 2026 4:13 AM | Updated on Sep 16 2026 4:13 AM

పింఛన్‌ ఆశలపై నీళ్లు!

మరో రెండు రోజులపాటు గడువు పెంపు

సాక్షి, పార్వతీపురం మన్యం: కొత్తగా సామాజిక పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో గ్రామ/వార్డు సచివాలయాలు రద్దీగా మారుతున్నాయి. ఇప్పటికే సుమారు 20 వేల దరఖాస్తులు జిల్లా వ్యాపితంగా అందాయి. ఇంకా వేలాది మంది సచివాలయాలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. గడువు తక్కువ ఇవ్వడం.. వరుస మూడు రోజుల పాటు సెలవులు రావడంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన అధికమైంది. తొలుత ప్రభుత్వం ఇచ్చిన గడువు ప్రకారం బుధవారం ఆఖరి రోజు. గడువు పెంచాలని వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ వరకూ అవకాశం కల్పించారు.

మొరాయిస్తున్న సర్వర్‌

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండున్నరేళ్లుగా కొత్త పింఛన్ల ఊసెత్తలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు నేపథ్యంలో ఒక్కసారిగా కొత్త పెన్షన్లు మంజూరు అంటూ తేదీలను ప్రకటించింది. ఈ నెల ఏడు నుంచి 16వ తేదీ వరకూ మాత్రమే దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రకటించింది. గడువు తక్కువగా ఉండడంతో అర్హత ఉన్న దివ్యాంగులు, వృద్ధులు, వితంతులు సచివాలయాల వద్ద బారులు తీరుతున్నారు. సర్వర్‌ పనిచేయక దరఖాస్తులను అప్‌లోడ్‌ చేయడం కష్టంగా మారింది. ప్రస్తుతం జిల్లాలో 1,36,470 మంది లబ్ధిదారులకు 15 రకాల సామాజిక పింఛన్లు అందిస్తున్నారు. రూ.4 వేలు నుంచి రూ. 15 వేల వరకు వివిధ కేటగిరీల్లో మొత్తం లబ్ధిదారులకు అందుతోంది. వేలమంది నిత్యం కొత్త పింఛన్‌ కోసం అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తాజాగా దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలపై నేడు నీళ్లు కుమ్మరిస్తున్నారు. వారు సచివాలయానికి వెళ్లిన సమయంలో అక్కడి సిబ్బంది నుంచి ఎదురవుతున్న ప్రశ్నలు, అడుగుతున్న పత్రాలు అర్హులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కుల ధ్రువీకరణతో పాటు ఐటీ, గ్యాస్‌ బిల్లు, ఇంటి పన్ను రశీదు తదితర పత్రాలు కావాలంటూ సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. ఇంటి పన్ను చెల్లిస్తేనే.. దరఖాస్తు చేసుకోవాలన్న అదనపు నిబంధన పెడుతున్నారు. వితంతువులకు వారి భర్త మరణ ధ్రువీకరణ పత్రం ఉన్నప్పటికీ రేషన్‌కార్డులో అతని పేరు ఉంటే దరఖాస్తు తీసుకోవడం లేదు. ఇప్పటికిప్పుడు రేషన్‌ కార్డులో భర్త పేరు ఎలా తొలగించాలి, అవసరమైన పత్రాలు ఎక్కడి నుంచి తీసుకురావాలి అని వితంతువులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల మ్యాపింగ్‌ కాలేదంటూ తిప్పి పంపుతున్నారు. కొంతమందికి స్టడీ సర్టిఫికెట్లు తేవాలని అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఇన్ని పత్రాలు ఎలా తేవాలంటూ.. అర్హులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తులను నమోదు చేస్తున్న సమయంలో సర్వర్లు మొరాయిస్తుండటంతో అటు సిబ్బంది, ఇటు దరఖాస్తుదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గంటల కొద్దీ సర్వర్‌ పని చేయకపోవడంతో దరఖాస్తుదారులను సచివాలయాల్లో కూర్చోపెడుతున్నారు. ఈ సమస్య వల్ల ఓటీపీలు కూడా రావడం లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. జిల్లాలో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు చెప్పిన వారికే దరఖాస్తులు తీసుకుంటున్నారన్న ఆరోపణలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి.

తొలుత ప్రభుత్వం ఈ నెల 16వ తేదీ లోపు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి గడువుగా నిర్ణయించింది. రెండో శనివారం, ఆదివారం, సోమవారం వినాయక చవితి పండగ కావటం వల్ల వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో దరఖాస్తులకు ఆటంకం ఏర్పడింది. సెలవులు ముగిశాక కేవలం రెండు రోజుల గడువే ఉంది. సర్వత్రా ఆందోళనల నేపథ్యంలో దరఖాస్తు గడువును మరో రెండు రోజులపాటు పెంచుతున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ మంగళవారం రాత్రి ప్రకటించారు. పలు ఆంక్షలు, సమస్యల నేపథ్యంలో కొత్త పింఛన్లు ఇచ్చే చిత్తశుద్ధి కూటమి ప్రభుత్వానికి లేదని పలువురు దరఖాస్తుదారులు వాపోతున్నారు.

మొరాయిస్తున్న సర్వర్‌

ధ్రువపత్రాల కోసం ఇబ్బందులు పడుతున్న దరఖాస్తుదారులు

దరఖాస్తు గడువు రెండు రోజులపాటు పొడిగింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement