గరుగుబిల్లి: అల్పపీడన ప్రభావంతో ఒడిశాలో కురుస్తున్న వర్షాల నాగావళి నదిలో తోటపల్లి ప్రాజెక్టువద్ద నీటి ప్రవాహం నిలకడగా ఉంది. మంగళవారం సాయంత్రం నాటికి 105 మీటర్లకు 104.15 మీటర్ల మేర నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులో 3,570ల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, రెండు గేట్లను ఎత్తేసి 4,706 క్యూసెక్కుల నీటిని తిరిగి నదిలోకి విడిచిపెడుతున్నారు. కుడి ప్రధాన కాలువకు 800, పాతకుడి కాలువకు 40, ఎడమ కాలువకు 414 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నట్టు ప్రాజెక్టు ఏఈ కిశోర్ తెలిపారు.
వీరఘట్టంలో కుండపోత
వీరఘట్టం: వీరఘట్టంలో మంగళవారం ఉదయం వేసవిని తలిపించే ఎండతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఉక్కపోత, ఎండ తీవ్రతతో అల్లాడిపోయారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సాయంత్రం 6 గంటల వరకు ఏకదాటిగా కుండపోతగా వర్షం కురిసింది. 4.8 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు తహసీల్దార్ రాజేశ్వరరావు తెలిపారు. పొలాల్లో నీరు చేరడంతో రైతులు సంతోషపడుతున్నారు.
నవంబర్ 15న
ఎన్‌ఎంఎంఎస్‌ఎస్ రాతపరీక్ష
పార్వతీపురం రూరల్: జాతీయ ప్రతిభ ఆధారిత పేదరిక నిర్మూలన ఉపకార వేతన పథకం (ఎన్‌ఎంఎంఎస్‌ఎస్) రాతపరీక్ష ఈ ఏడాది నవంబర్ 15న జరగనుందని డీఈఓ పి.బ్రహ్మాజీరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఏపీ మోడల్, ఎయిడెడ్ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. ఏడో తరగతిలో 55 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 50 శాతం) సాధించి ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3.50 లక్షల లోపు ఉండి, తహసీల్దార్ ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుము కింద ఓసీ, బీసీలు రూ.100, ఎస్సీ, ఎస్టీలు రూ.50 చొప్పున ఎస్‌బీఐలో చెల్లించాలి. పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం అందుతుంది. ఆసక్తిగల విద్యార్థుల దరఖాస్తు చేసేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలని కోరారు.
కొత్తవలస: వినాయక చవితి పర్వదినాన జరిగిన రోడ్డు ప్రమాదం ఆ కుంటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఆనందగా గడపాల్సిన వేళ యువకుడిని మృత్యువు కాటేసింది. అరుకు–విశాఖపట్నం జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా,.. మరో యువకుడు తీవ్ర గాయాలతో కొన ఊపిరితో పోరాడుతున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లూరి సీతారామాజు జిల్లా అరకు సమీపంలోని అనంతగిరి ప్రాంతానికి చెందిన బిడ్డక చరణ్ (21), బిడ్డక రాజు ఇంటి వద్ద వినాయక పూజలు ముగించుకొని ద్విచక్రవాహనంపై విశాఖపట్నం బయలుదేరారు. కొత్తవలస మండలం జిందాల్ ఫ్యాక్టరీకి సమీపంలోని చెరువు వద్ద మరమ్మతులతో రోడ్డుపై నిలిపివేసిన బొలోరా వాహనాన్ని బైక్‌తో ఢీకొట్టారు. ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు. అక్కడకు చేరుకునే సరికి తలకు తీవ్రగాయాలు కావడంతో చరణ్ (21) మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. రాజు కొన ఊపిరితో వైద్యసేవలు పొందుతున్నాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు.


