పార్వతీపురం: స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని ఆదివారం జిల్లా వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించనున్నట్టు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. ఉదయం 10.30 గంటలకు కలెక్టర్ సమావేశ మందిరంలో టంగుటూరి జయంతి కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా, మండల, గ్రామస్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలో జస్టిస్
దుర్గాప్రసాదరావు పర్యటన
● మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికిన అధికారులు
● అనంతరం ఆస్పత్రుల పరిశీలన
పార్వతీపురం రూరల్ : ఆంధ్రప్రదేశ్ హైపవర్ కమిటీ చైర్మన్, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఉపమాక దుర్గాప్రసాదరావు శనివారం పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించారు. వైద్య విద్యా సంచాలకుల కార్యాలయ ప్రతినిధిగా విచ్చేసిన ఆయనకు.. ముందుగా జిల్లా సరిహద్దు బొబ్బిలి వద్ద వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన తన పర్యటనలో భాగంగా జిల్లాలోని సీతంపేట ఏరియా ఆస్పత్రితో పాటు శ్రీకాకుళం మెడికల్ కాలేజీకి వెళ్లారు. ఆయా ఆస్పత్రుల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతుల తీరుతెన్నులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి.విజయలక్ష్మి, జిల్లా ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ అధికారి (డీపీఎంవో) డాక్టర్ ఎన్.ఆర్.కె.రెడ్డి, సీనియర్ న్యాయవాది పి.రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
సుగర్ ఫ్యాక్టరీ విక్రయిస్తే ఊరుకోం
● భీమసింగి సుగర్ ఫ్యాక్టరీ
కొనసాగించాల్సిందే...
● ప్రభుత్వం తీరుపై గళమెత్తిన
నాయకులు
గజపతినగరం రూరల్ (జామి): భీమసింగి సుగర్ ఫ్యాక్టరీని రక్షించే బాధ్యత ప్రభుత్వానికి లేకపోవడం విచారకరమని, ఫ్యాక్టరీని విక్రయిస్తే ఊరుకునేది లేదని వివిధ పార్టీల నాయకులు, ప్రజా, రైతు సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇది రైతుల సహకారంతో ఏర్పడిన ఫ్యాక్టరీ అని స్పష్టంచేశారు. జామి మండలం భీమసింగి సుగర్ ఫ్యాక్టరీ వద్ద శనివారం వివిధ పార్టీలు, రైతు సంఘాలతో కూడిన పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, పార్టీ మండలాధ్యక్షుడు గొర్లె రవికుమార్ మాట్లాడుతూ... ప్రస్తుత ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఫ్యాక్టరీలకు చేయూతనివ్యాల్సిన ప్రభుత్వం తప్పించుకునే ధోరణి ప్రదర్శించడం దారణమన్నారు. భీమసింగి సుగర్ ఫ్యాక్టరీని ఆదుకోవాలని కోరారు. 2004 సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఫ్యాక్టరీకి జీవం పోశారని... రూ.18 కోట్లు గ్రాంట్ ఇచ్చి ఆదుకున్నారని గుర్తు చేశారు. వలంటీరుగా రిటైర్మెంట్ తీసుకున్న ఉద్యోగుల కోసం రూ.4కోట్లు మంజూరు చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం కూడా భీమసింగి సుగర్ ఫ్యాక్టరీని, రైతులను, ఉద్యోగులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుద్ధరాజు రాంబాబు, ఉపాధ్యక్షుడు పాండ్రంకి సంజీవరావు, మాజీ ఎంపీపీ కె.సూరిబాబురాజు, వైస్సార్‌సీపీ ఆర్టీఐ జిల్లా అధ్యక్షుడు అప్పాన సుబ్రహ్మణ్యం, చెరకు రైతు గుల్లిపల్లి జయపాల్, వైఎస్సార్‌సీపీ నాయకులు చలుమూరి సత్యారావు, నెక్కాలి సత్యనారాయణ, రైతులు పాల్గొన్నారు.


