వీరఘట్టం: ముక్క లేనిదే.. ముద్ద దిగని పరిస్థితి కొందరిది. అయితే మాంసాహారంలో పోషకాలు అధికంగా ఉంటాయన్నది ఎంత నిజమో అంతకు మించి క్యాలరీలు, కొవ్వు పదార్ధాలు కూడా ఉంటాయని, ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మాంసాహారం అధికంగా తింటే స్ధూలకాయంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులనూ తెచ్చి పెడుతున్నాయంటున్నారు. జిల్లాలో మాంసాహార ప్రియుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా కోవిడ్ వైరస్ విజృంభణ అనంతరం ఇది మరింత పెరిగింది. కోవిడ్ సమయంలో ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని ప్రచారం సాగడంతో చాలామంది అతిగా నాన్‌వెజ్‌ను తిన్నారు. ఆ అలవాటు ఇప్పటికీ కొనసాగుతోంది. గతంలో కొన్ని వర్గాల వారు వివాహాలలో శాఖాహారం మాత్రమే వడ్డించేవారు. నేడు చాలా మంది వివాహాల్లో కూడా మాంసాహారాన్ని ఏర్పాటు చేసే సంస్కతి ప్రారంభమైంది. ఉమ్మడి విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మాంసాహారాన్ని విక్రయించే హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్డు సైడు వ్యాపారాలు చేసే వారి సంఖ్య 10 వేలకు పైగానే ఉంటుందని అంచనా. ఆయా కేంద్రాల్లో ప్రతీ రోజు రూ.4 కోట్లు వరకు వ్యాపారం జరుగుతోందని సమాచారం. ముఖ్యంగా పార్వతీపురం, వీరఘట్టం, పాలకొండ, సాలూరు, కురుపాం, గరుగుబిల్లి, బొబ్బిలి, రామభద్రపురం, విజయగనగరం, రాజాం, చీపురుపల్లి, ఎస్.కోట, నెల్లిమర్ల, భోగాపురం, పూసపాటిరేగ తదితర అనేక ప్రాంతాల్లో నాన్‌వెజ్ హోటళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు రోడ్డు పక్కన కేవలం చిరుతిండ్లు, బజ్జీ కొట్లు మాత్రమే కనిపించేవి. ఇప్పుడు నాన్‌వెజ్ ఆహార పదార్ధాలు విక్రయించే కేంద్రాలు ఉమ్మడి జిల్లాల్లో ప్రత్యేకంగా లెక్కలేనన్ని వెలుస్తున్నాయి.
నాన్‌వెజ్ పడనివారు తినకూడదు
కొందరికి నాన్‌వెజ్ అంటే పడదు. అలాంటి వారు ఈ పదార్ధానికి దూరంగా ఉంటేనే మేలు. ఫ్యామిలీ హిస్టరీలో గుండె జబ్బులున్న వారు జాగ్రత్తగా ఉండాలి. కోలన్ క్యాన్సర్ ఉన్నవారు బీఫ్ తినకూడదు. నాన్‌వెజ్ వల్ల ఇబ్బందులు ఎదురయ్యే జనటిక్ డిసీజ్ ఉన్నవారు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. నాన్‌వెజ్ తినడం వల్ల జబ్బులు రావు. కానీ అందులో వాడే పదార్ధాలు నాణ్యమైనవి కాకపోతే వస్తాయి.
– డాక్టర్ జె.రవీంద్రకుమార్,
ప్రముఖ వైద్యులు, పార్వతీపురం
నాణ్యత పాటించాలి
హోటళ్లు, రెస్టారెంట్లలో తయారుచేసే మాంసాహారానికి వాడే పదార్ధాలు నాణ్యతగా ఉండాలి. నిల్వ ఉన్న మాంసంతో వండి పెట్టకూడదు. ఇలాంటి పదార్ధాన్ని తిన్న వారి ఆరోగ్యం దెబ్బ తింటుంది. దీనికి ఆహార పదార్ధాల్లో నిషేధిత రంగులు కలపడం కూడా నేరం. ప్రజలు సైతం రంగు, వాసన చూసి మోసపోయి ఆనారోగ్యాన్ని కొని తెచ్చుకోవద్దు.
– ఎం.వినోద్‌కుమార్, జిల్లా ఫుడ్ కంట్రోల్
అధికారి, పార్వతీపురం మన్యం జిల్లా


