ప్రభుత్వంపై అసంతృప్తి..
ఎమ్మెల్యేలకు పరీక్ష
సాక్షి, పార్వతీపురం మన్యం: స్థానిక ఎన్నికలకు కసరత్తు శరవేగంగా సాగుతోంది. పట్టణ, పంచాయతీల్లో రాజకీయ వేడి మొదలైంది. ఇప్పటి వరకూ ఉమ్మడి విజయనగరం జిల్లాతో ముడిపడి ఉన్న మన్యం.. ఇకపై పూర్తి స్థాయిలో విడిపోక తప్పదు. 15 మండలాలతో కొత్తగా జిల్లా పరిషత్ ఏర్పడనుంది. దీంతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి, ఉపాధ్యక్ష పదవి మన్యానికి దక్కనున్నాయి. ఇదే సమయంలో చంద్రబాబు నిర్ణయం వల్ల పదవులకు కోత పడనుంది. గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పురపాలికలు, నగర పంచాయతీల్లో చైర్మన్‌తో పాటు.. ఇద్దరేసి చొప్పున వైస్ చైర్మన్లను నియమించిన విషయం విదితమే. దీనివల్ల ఇప్పటి వరకూ జిల్లాలోని పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలతో పాటు.. పాలకొండ నగర పంచాయతీలో చైర్మన్, ఇద్దరు చొప్పున వైస్ చైర్లన్లు ఉండేవారు. చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం వల్ల ఇక మీద వైస్ చైర్మన్ పదవి ఒక్కరికే దక్కుతుంది. మండల పరిషత్‌లోనూ ఉపాధ్యక్ష పదవి ఒకరికే దక్కనుంది. దీనివల్ల సామాజిక వర్గాల పరంగా పదవులు ఆశించే వారికి కాస్త నిరాశ కలగకమానదు.
జిల్లాలో రెండు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ, 451 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. చైర్మన్, వైస్ చైర్మన్‌లను కూడా నేరుగా ఓటర్లే ఎన్నుకునేలా, ప్రత్యక్ష విధానంలోనే ఎన్నిక పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. రెండేళ్ల పాలనలోనే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఉద్యోగ, వ్యాపార, మహిళలు, రైతులు.. ఇలా అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అవినీతి, కబ్జాలలో ప్రజా ప్రతినిధులు ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాలను అమ్ముకుంటున్నారు. పథకాలు సక్రమంగా అందని పరిస్థితి. రైతులకు ఎరువులు కూడా ఇవ్వలేకపోతున్నారు. వార్డు కౌన్సిలర్, పంచాయతీ ప్రెసిడెంట్, జిల్లా పరిషత్, మండల పరిషత్ సభ్యులను గెలిపించుకోవడమే అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సవాల్‌గా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో అడ్డదారినైనా అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను పొందాలని చూస్తున్న నాయకులకు ఎన్నికల సమయంలో అసలు సిసలు పరీక్ష ఎదురు కానుంది.
‘డబుల్’కు కోత పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం
ఇకపై ‘వైస్’ ఒక్కరే..
ప్రత్యక్షంతో ఎమ్మెల్యేలకు పరీక్షే..
మారనున్న స్థానిక లెక్కలు


