● జర్నలిస్టుల సమస్యలపై మండలిలో ఎమ్మెల్సీ ప్రస్తావన
నెల్లిమర్ల రూరల్: గతంలో జరిగిన ఏపీ శాసన మండలి సమావేశాల్లో రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలను ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సూర్యనారాయణరాజు ప్రస్తావించారు. ఆయన ప్రశ్నలకు ప్రభుత్వం తాజాగా వివరణ ఇచ్చింది. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. జర్నలిస్టులకు గుర్తింపు కార్డులు, ఆరోగ్య భద్రత, ఇళ్ల స్థలాల సమస్యలను గతంలో జరిగిన సమావేశాల్లో ఆయన ప్రస్తావించారు. అర్హత గల జర్నలిస్టులకు 2026–27 సంవత్సరానికి అక్రిడిటేషన్ కార్డుల జారీకి నూతన నిబంధనలు రూపొందించామని, రాష్ట్రస్థాయిలో 2,797, జిల్లా స్థాయిలో 14,681 కలిపి మొత్తం 17,480 కార్డులు ఇప్పటివరకు జారీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆరోగ్య భద్రత కోసం ఆరోగ్య పథకాన్ని కొనసాగిస్తున్నామని, ఏడాదికి రూ.2500 ప్రీమియంలో ప్రభుత్వం సగం చెల్లిస్తోందని..జర్నలిస్టుతో పాటు జీవిత భాగస్వామి, పిల్ల లు, ఆధారపడ్డ తల్లిదండ్రులకు ఈ పథకం వర్తిస్తుందని, రూ.2లక్షల వరకు వైద్య రక్షణ ఉంటుందని వివరించింది. ఇళ్ల స్థలాల కేటాయింపు, ఇళ్ల నిర్మాణం చేపట్టే అంశం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉందని స్పష్టం చేసింది.


