రాజాం సిటీ: అవకాశం కనిపించని చోట కూడా దానిని ఊహించగలగడమే నిజమైన పారిశ్రామిక వేత్త లక్షణమని జీఎంఆర్ ఐటీ డీయూ వీసీ డాక్టర్ జె.గిరీష్ అన్నారు. మంచి పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలంటే నిరంతర కృషి, పట్టుదల అవసరమని తెలిపారు. విద్యార్థుల్లో ఔత్సాహిక ఆలోచనలు, ఆవిష్కరణలు, సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు అందించే దృక్పథాన్ని పెంపొందించే లక్ష్యంగా శుక్రవారం జీఎంఆర్ ఐటీ డీయూలో ప్రపంచ పారిశ్రామిక వేత్తల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్య సాధనకు బలమైన కోరిక, నిరంతర ప్రయత్నం, పట్టుదల అవసరమని, దీర్ఘకాలిక విజయవానికి నైతిక విలువలు, నిజాయితీ ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ డీన్ డాక్టర్ సీఎల్‌వీఆర్‌ఎస్‌వీ ప్రసాద్ మాట్లాడుతూ పారిశ్రామిక వేత్తగా ఎదగడం అంటే కేవలం డబ్బు సంపాదించడం కాదని, సమాజ అవసరాలకు కొత్త పరిష్కారాలను అందించే ఆలోచానా విధానమని అన్నారు. విద్యార్థులు సాంకేతికతను సృష్టించే డెవలపర్లుగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన కళాశాల పూర్వవిద్యార్థులైన పారిశ్రామిక వేత్తలు వారి అనుభవాలను పంచుకున్నారు. వ్యాపారం ప్రారంభించే ముందు కొన్నేళ్లు పరిశ్రమ అనుభవం అవసరమన్నారు. మంచి ఆలోచనను విజయవంతం చేసేది క్రమశిక్షణతో కూడిన అమలేనని తెలిపారు. ఏ రంగంలో అయినా నిరంతర సాధన, కష్టపడి పనిచేయడమే విజయానికి మార్గమని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నైతిక విలువలతో కృషిచేయడం ద్వారా విద్యార్థులు విజయవంతమైన పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిర్వహించిన స్టార్టప్ ఐడియా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులైన వ్యాపారవేత్తలు మెట్ట మురళి, గంటా అనిల్ నాయుడు, పైడి నటరాజు, చెరుకూరి సందీప్ కొత్తా శ్రావణి, బి.మనోజ్ తదితరులు పాల్గొన్నారు.


