● మళ్లీ పుంజుకుంటున్న జానపద కళా రూపాలు
● నేడు ప్రపంచ జానపద కళాకారుల దినోత్సవం
బొబ్బిలి: గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధమయిన మాధ్యమాలు, కళలు లేని కాలంలో పల్లె ప్రజలకు అండగా ఆనందాన్ని నింపే సంప్రదాయ కళే జానపదం. మొదట బుర్రకథలు అనంతరం నాటికలు, ఆ తరువాత టీవీ ఇక సినిమా సంగతి చెప్పనక్కరనే లేదు. ఈ క్రమంలో కనుమరుగయిపోయిన జానపద కళారూపాలయిన తప్పెటగుళ్లు, కోలాటాలు, డప్పు వాయిద్యాలు, జముకు కథలు, ఊకొట్టు పాటలు, ఇంకా పురాతనమయిన తుర్పు బాఘవతాలకు మళ్లీ జీవం పోస్తున్నారు బొబ్బిలి ప్రాంత కళాకారులు. అందులో ముఖ్యభూమిక పోషిస్తున్నారు. ముఖ్యంగా జానపదాల్లో కోలాటం, డప్పు కళాకారులు ప్రస్తుతం మళ్లీ తెరపైకి తీసుకువచ్చిన వారిలో గేదెల కరుణ్‌కుమార్ ఒకరు. ఇతను బొబ్బిలిలో మల్టీ టాలెంట్ డాన్స్ అకాడెమీని స్థాపించారు. ఈ అకాడెమీలు చిన్న పెద్ద అన్న తారతమ్యం లేకుండా అందరూ పాల్గొని నృత్య శిక్షణ తీసుకుంటున్నారు. అనేక కోలాటం నృత్య ప్రదర్శనలకు వెళ్లి ఆకట్టుకుంటున్నారు. గతంలో కేవలం గ్రామ దేవత పండగలు, ఇతర పర్వదినాలకు మాత్రమే ఇటువంటి ప్రదర్శనల బృందాలు హాజరయ్యేవి. ఇప్పుడు వివాహ, జన్మదిన కార్యక్రమాలకు కూడా ఈ కోలాటం, తప్పెటగుళ్ల బృందాలను బుక్ చేసుకుని ఆహూతులను అలరించేందుకు సంసిద్ధమవుతున్నారు. కరుణ్‌కుమార్ 1999 నుంచి నృత్యప్రదర్శనలు ఇస్తున్నారు. చిన్నప్పుడు బాలనాగమ్మ బుర్రకథలో బాలరాజుగా నటించి ఆ తరువాత కళా ప్రదర్శనల వైపు ఆకర్షితులయ్యారు. ఇప్పటివరకూ వివిధ రాష్ట్రాల్లో వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చారు. కేవలం కోలాటం కాకుండా తప్పెటగుళ్లు, బిందెల డాన్స్‌తో పాటు డప్పు వాయిద్య ప్రదర్శన వంటి కళలపై ఔత్సాహికులకు శిక్షణ ఇస్తూ ఆకట్టుకుంటున్నారు. జానపద కళారూపాలకు కరుణ్‌కుమార్ ప్రదర్శనలు ఇస్తూ, జానపద కళలు, సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించే కార్యక్రమాలను కూడా వివిధ వేదికలలో నిర్వహించారు. తాను వివిధ నటులు, నర్తకులు, సంప్రదాయం, కళలను చూసి నేర్చుకున్నదేనని, అందుకే అందరికీ వీటిని నేర్పించి ఆయా కళలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాననీ సాక్షికి తెలిపారు.
తూర్పుభాగవతాన్ని కాపాడుతూ..
వారసత్వ కళను కొనసాగిస్తూ..
తూర్పు భాగవతం అంటే దశాబ్దాల నాటి ఓ అద్భుతమయిన కళ. ఆ కళను తాత తండ్రుల నుంచి వచ్చిందే కదానని వదిలేయకుండా నేటి కాలంలోనూ ఆ కళను కొనసాగిస్తున్న బొంతలకోటి శంకర రావు వివిధ రాష్ట్రాల్లో సైతం ఇప్పుడు ప్రదర్శనలు ఇస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకప్పడు పండగల్లో తప్పనిసరి ప్రదర్శనగా తూర్పు భాగవతం ఉండేది. రాను రాను సంప్రదాయ కళలు అంతరించిపోతున్నట్టే నేడు తూర్పుభాగవతం కూడా అంతరించిపోయే దశలో ఉందని చెప్పవచ్చు. సరిగ్గా అప్పుడే ఆ కళను నిలబెట్టే బాధ్యతను భుజాలకెత్తుకున్నారు బొబ్బిలి మండలం కోమటిపల్లికి చెందిన బొంతలకోటి శంకర రావు. ఆ కళను జాతీయ, రాష్ట్ర స్థాయిలో పలు వేదికల్లో ప్రదర్శనలిస్తూ బొబ్బిలికి పేరు తీసుకువస్తున్నారు. ఇప్పటికే తూర్పుభాగవతంపై పరిశోధన చేసి ఐటీలో డాక్టరేట్ అందుకున్నారు. గిడుగు రామ్మూర్తి పురస్కారం కూడా అందుకున్నారు. హైద్రాబాద్ శిల్పారామంలో సంస్కార భారతి ఆధ్వర్యంలో లోక్‌మంతన్ కార్యక్రమంలో ప్రదర్శన. ఈసస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ప్రదర్శన ఇచ్చి కేంద్ర మంత్రి చేతుల మీదుగా గౌరవ పురస్కారం అందుకున్నారు. ఏలూరులో ఎన్‌టీఆర్ జీవిత సాఫల్య పురస్కారం, మూడో ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రదర్శనతో ఆంధ్రశ్రీ పూర్ణకుంభ పురస్కారం మొత్తంగా 3వేల ప్రదర్శనలు ఇచ్చిన ఘనత శంకరరావు స్వంతమయింది. ఈ కళను అందించిన తండ్రి బొంతలకోటి సాంబమూర్తి పేరున పాఠశాల ఏర్పాటు చేసి జానపద కళలపై ఉచిత శిక్షణ, అన్నదాన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. పురాతన కళపై ఇంకా ఆసక్తి ఉన్న ప్రేక్షకులు ఉన్నారని, ఆ కళను తరచూ ప్రదర్శిస్తే దానికి అలవాటు పడి ఇతర ఆధునిక కళలకన్నా మంది ఆదరణ ఉంటుందని శంకరరావు సాక్షికి చెప్పారు.


