రెందు బైక్‌లు ఢీకొని ఇద్దరి మృతి | - | Sakshi
Sakshi News home page

రెందు బైక్‌లు ఢీకొని ఇద్దరి మృతి

Aug 22 2026 1:35 AM | Updated on Aug 22 2026 1:35 AM

గజపతినగరం రూరల్‌ (జామి): జామి మండలంలోని జాగారం గ్రామం వద్ద శుక్రవారం రాత్రి ఒక బైక్‌ను వెనుక నుంచి మరో బైక్‌ ఢీకొనడంతోజరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రావాడ వెంకట్రావు (60) అనే వ్యక్తి తన బైక్‌లో ఆయిల్‌ అయిపోవడంతో ద్విచక్ర వాహనాన్ని నడిపించుకుంటూ వస్తుండగా.. వెనకనుంచి గొర్లె పవన్‌(25) అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంతో పస్తూ బలంగా ఢీకొన్నాడు. దీంతో వెంకట్రావు అక్కడికక్కడే మృతి చెందగా, పవన్‌ కుమార్‌ కూడా తన ద్విచక్ర వాహనం నుంచి దూరంగా రోడ్డుపై పడడంతో తలకు తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకట్రావు జామి పంచాయతీ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రమాద సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

యువకుడి ఆత్మహత్య

బొబ్బిలిరూరల్‌: మండలంలోని పారాది గ్రామానికి చెందిన పున్నాన చంద్రశేఖర్‌(22) అనే యువకుడు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన చిన్నమ్మలు, బోడయ్యలకు ఇద్దరు పిల్లలు కాగా కుమార్తెకు వివాహం చేశారు. కుమారుడు చంద్రశేఖర్‌ విశాఖలో ఓ ఫర్నిచర్‌ దుకాణంలో పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులు చైన్నె పట్టణానికి కూలి పనుల కోసం వెళ్లిపోయారు. ఇంట్లో ఎవరూ లేకపోగా ఈనెల 12న చంద్రశేఖర్‌ స్వగ్రామం పారాది చేరుకుని ఒక్కడే నివసిస్తుండగా గురువారం అర్ధరాత్రి దాటాక ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటి చుట్టుపక్కల వారి ద్వారా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు శుక్రవారం సంఘటనా స్థలంలో దర్యాప్తు ప్రారంభించారు.యువకుడి మొబైల్‌ లోని కాల్స్‌, వాట్సప్‌ చాటింగ్‌ పరిశీలించిన అనంతరం చంద్రశేఖర్‌ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉండవచ్చని సీఐ నారాయణరావు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బొబ్బిలి సీహెచ్‌సీకి తరలించినట్లు తెలియజేశారు.

అపరిచితులకు సమాచారం చెప్పొద్దు

సాలూరు రూరల్‌: అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం ఇవ్వొద్దని సాలూరు పట్టణ సీఐ అప్పలనాయుడు అన్నారు. దీనివల్ల సైబర్‌ మోసాల బారిన పడతారని హెచ్చరించారు. నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం బొడ్డవలస గ్రామంలో ఇంటిఇంటి మన్యం పోలీస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు.

వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ

విజయనగరం టౌన్‌: విశాఖ దాబా గార్డెన్స్‌లోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో అక్టోబరు 10, 11వ తేదీల్లో నిర్వహిస్తున్న సాహిత్య సమ్మేళనం కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను స్థానిక మహాకవి గురజాడ స్వగృహంలో శుక్రవారం ఆవిష్కరించారు. సాహితీ స్రవంతి, అల్లూరి విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో కథ, కవిత్వం, విమర్శ తదితర అంశాలపై ప్రముఖుల ప్రసంగాలు, అనంతరం వర్ధమాన సాహితీవేత్తలతో ఇష్టాగోష్టి ఉంటాయని సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి చీకటి దివాకర్‌ తెలిపారు. సమ్మేళనంలో పాల్గొనాలనుకునే వారు ఫోన్‌ నంబర్లు 9441176882, 9490098794, 9490098811లను సంప్రదించాలని కోరారు. రెండు రోజుల పాటు సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తుండడం హర్షణీయమని మాజీ ఎంపీ, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ డీవీజీ శంకరరావు అన్నారు. యువ సాహిత్యవేత్తలు కూడా సమ్మేళనానికి వచ్చి తమ ఆలోచనలను పంచుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement