విజయనగరం రూరల్: స్థానిక కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయంలో చైన్నెకి చెందిన బోర్డ్ ఆఫ్ అంప్రెటిస్‌షిప్ ట్రైనింగ్ (సదరన్ రీజియన్) సహకారంతో జాతీయ అప్రెంటిస్‌షిప్ పథకంపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అఫిషియేటింగ్ వైస్ చాన్స్‌లనర్ ప్రొఫెసర్ జితేంద్రమోహన్ మిశ్రా మాట్లాడుతూ విద్యార్థులు తరగతి గది జ్ఞానంతో పాటు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. అప్రెంటిస్‌షిప్ ఆధారిత డిగ్రీ కార్యక్రమం ద్వారా ప్రత్యక్ష పని అనుభవం లభించి, విద్యార్థుల నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, ఉపాధి సామర్థ్యం పెరుగుతాయన్నారు. బోర్డ్ ఆఫ్ అంప్రెటిస్‌షిప్ ట్రైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజమణి రాజు అప్రెంటిస్‌షిప్ శిక్షణ లక్ష్యాలు, శిక్షణ విధానం, పరిశ్రమ అనుభవం, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు సాంకేతిక, వృత్తిపరమైన, సంభాషణ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. అప్రెంటిస్ షిప్‌తో విద్యార్థులు తమ విద్యా జ్ఞానాన్ని, ఆచరణలో ఉపయోగించుకోవడంతో పాటు పరిశ్రమ అవసరాలను అర్థం చేసుకుని భవిష్యత్తు ఉపాధికి సిద్ధం కావడంపై ప్రత్యేకంగా వివరించారు. ఇన్‌చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ శంకర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి నైపుణ్య ఆధారిత శిక్షణ ఎంతో అవసరమన్నారు. విద్యార్హతలతో పాటు ఆచరణాత్మక నైపుణ్యాలు, పని అనుభవం, వృత్తిపరమైన దృక్పథం విద్యార్థుల ఉపాధి సామర్థ్యాన్ని పెంచుతాయన్నారు. ఈ కార్యక్రమాన్ని జర్నలిజం విభాగపతి డాక్టర్ ఇపిల్లి తారకేశ్వరరావు సమన్వయం చేయగా డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


