● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు డిమాండ్
గజపతినగరం రూరల్ (జామి): భీమసింగి సుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం కొనసాగించాలని, లిక్విడేషన్ చేయడం సరైన విధానం కాదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన జామి మండల కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ భీమసింగి సుగర్ ఫ్యాక్టరీ అంశాన్ని ప్రస్తావించారు. కో ఆపరేటివ్ సుగర్ ఫ్యాక్టరీలను జనరల్ బాడీ ఆమోదం లేకుండా లిక్విడేషన్ చేయడం చట్ట విరుద్ధమన్నారు. 1960లో రైతుల భాగస్వామ్యంతో నిర్మించిన భీమసింగి సుగర్ ఫ్యాక్టరీని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఈ స్థలంలో మళ్లీ వ్యవసాయ ఆధారిత ప్రాజెక్టును మాత్రమే నెలకొల్పాలని డిమాండ్ చేశారు. 75 ఎకరాల విస్తీర్ణం గల ఈ స్థలాన్ని అమ్మాలని నిర్ణయించడం సరైన విధానం కాదని తప్పుబట్టారు. ప్రభుత్వం ఎన్నో రకాలైన ఖర్చులు చేస్తుందని, ఆ ఖర్చుల్లో భాగంగానే ఈ అప్పులను ప్రభుత్వమే చెల్లించి సుగర్ ఫ్యాక్టరీలను రక్షించాలన్నారు. రాష్ట్రంలోని మూడు సుగర్ ఫ్యాక్టరీలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జిల్లా పార్టీ పెద్ద, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ద్వారా తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌హన్ రెడ్డి దష్టికి తీసుకు వెళ్తామన్నారు. తద్వారా రైతాంగానికి అండగా నిలిచి రైతులకు మేలు జరిగేలా చూస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గొర్లె సరయు, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు గొర్లె రవికుమార్, ఎంపీపీ సబ్బవరపు అరుణ, సంజీవరావు పాల్గొన్నారు.


