శుక్రవారం శ్రీ 14 శ్రీ ఆగస్టు శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శుక్రవారం శ్రీ 14 శ్రీ ఆగస్టు శ్రీ 2026

Aug 14 2026 7:38 AM | Updated on Aug 14 2026 7:38 AM

న్యూస్‌రీల్‌

మధ్యతరగతి కుటుంబాలపై పెరుగుతున్న రుణభారం

పిల్లల చదువులు, ఇతర అవసరాల కోసం అప్పులపైనే ఆధారం

సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్‌/పాలకొండ రూరల్‌/భామిని:

పార్వతీపురంలోని ఓ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న ఎం.కృష్ణ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. జీతం రూ.60 వేల వరకు వస్తున్నా.. అప్పులతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నట్లు ఆయన చెబుతున్నారు. కాలేజీ చదువులకొచ్చిన ఇద్దరు పిల్లల ఫీజులే ఏడాదికి రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకూ అవుతోందని.. వస్తున్న జీతం కుటుంబం గడవడానికే చాలడం లేదని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో క్రమం తప్పకుండా బ్యాంకు రుణాలు, బంగారం తాకట్టు, తెలిసిన వారి దగ్గర వడ్డీకి అప్పులు తీసుకోవడం.. సర్వసాధారణంగా మారిందని తెలిపారు.

జిల్లాలో పేద, మధ్యతరగతి కుటుంబాలు అప్పుల ఛట్రంలో చిక్కుకుంటున్నాయి. పిల్లల చదువు, ఆస్తుల కొనుగోలు, వాహనాలు, వ్యవసాయ పెట్టుబడులు, వ్యాపారం తదితర అవసరాల కోసం రుణాలవైపే చూస్తున్నాయి. వ్యవసాయాధారిత, వెనుకబడిన జిల్లా అయిన పార్వతీపురం మన్యంలో సుమారు 2.30 లక్షల కుటుంబాలున్నాయి. వీటిలో అధిక శాతం పేద, మధ్యతరగతి వారే. ఇందులో 70–80 శాతం మంది వివిధ అవసరాల కోసం అప్పులతోనే నెట్టుకొస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో డీబీటీ రూపంలో వివిధ పథకాల కింద ప్రతి నెలా ఎంతో కొంత చేతిలో నగదు ఉండేది. అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతిదీవెన వంటి పథకాలు పిల్లల ఫీజులకు అక్కరకు వచ్చేవి. గృహ వసతితో అద్దె భారం తప్పేది. వైఎస్సార్‌ ఆసరా, చేయూతతో మహిళా సంఘాల రుణమాఫీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఆర్థిక భద్రత దక్కేది. వైఎస్సార్‌ రైతు భరోసాతో రైతులకు పెట్టుబడి సాయం అందేది. వైఎస్సార్‌ వాహన మిత్రతో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా ఆర్థిక సాయం లభించేది. నేతన్న నేస్తం, మత్స్యకార నేస్తం, జగనన్న తోడుతో వృత్తిదారులకు, వీధి వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు అందేవి. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల కాలంలో ఒక్కో కుటుంబానికి రూ.8 లక్షల నుంచి రూ.13 లక్షల వరకు వివిధ పథకాల రూపంలో లబ్ధి పొందేవారు. ప్రస్తుతం పేద, మధ్యతరగతి వర్గాలకు ఆర్థిక భరోసా దూరమైంది. దేశంలో 28.3 కోట్ల కుటుంబాలపై తలసరి రుణ భారం రూ.4.77 లక్షలు ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్‌చౌదరి ఇటీవల లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 80 శాతం కుటుంబాలు రుణాలపైనే ఆధారపడుతున్నాయని వెల్లడించడం గమనార్హం. చిరుద్యోగులే కాదు.. ప్రభుత్వ ఉద్యోగులు సైతం నెలవారీ అవసరాలు, వాహన కొనుగోలు, పిల్లల చదువుల కోసం వడ్డీ వ్యాపారులను, బ్యాంకు రుణాలను ఆశ్రయిస్తున్నారు. వ్యాపారులు, రైతులు, సాధారణ కుటుంబాలు రోజువారీ వడ్డీ, బంగారం, భూమల తాకట్టు పెట్టి జీవితాలను నెట్టుకొస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement