పక్షవాతంతో మంచం పట్టినా అందని రిలీఫ్ ఫండ్
బలిజిపేట: నిరుపేదలు, వైద్యం చేయించుకునేందుకు ఆర్థిక స్థోమత లేని అభాగ్యులకు అందాల్సిన సీఎం రిలీఫ్ ఫండ్ అనర్హులకు అందుతుందన్న వాదన పార్వతీపురం నియోజకవర్గంలో బలంగా వినిపిస్తోంది. కమీషన్లకు కక్కుర్తిపడి ఆర్థిక స్థోమత ఉన్నవారి పేర్లునే సీఎం సహాయనిధికి సిఫార్సు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం రిలీఫ్ ఫండ్‌లోనూ చేతివాటం చూపడం, అర్హులకు అందజేయకపోవడంపై సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతోంది.
నియోజకవర్గంలో ఇటీవల కాలంలో సుమారు పదిమందికి రూ.23.21లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైంది. అయితే, అనర్హులకు ఆర్థిక సహాయం అందజేసి, వారి నుంచి కమీషన్ల రూపంలో నాయకులు డబ్బులు తిరిగి వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అన్ని అర్హతలు ఉన్నా, వ్యాధులతో మంచం పట్టి, ఆర్థిక ఇబ్బందులు పడుతున్నవారికి సహాయ నిధిని అందించడంలేదన్న విమర్శలు ఉన్నాయి. పక్షవాతంతో మంచం పట్టిన వారిని కాదని ఆర్థికంగా బలంగా ఉండేవారి పేర్లును సీఎం సహాయనిధికి నాయకులు సిఫార్సులు చేయడంపై పలు గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు.
చిత్రంలో మంచం పట్టినది వంతరాం ఎస్సీ కాలనీకి చెందిన డర్రు ఆదిలక్ష్మి. ఆమె వయస్సు సుమారు 60 సంవత్సరాలు. సెంటు భూమి లేదు. పక్షవాతంతో మంచం పట్టింది. శ్రీకాకుళంలోని కిమ్స్, వీరఘట్టంలో ప్రైవేటు వైద్యుల వద్ద వైద్యసేవలు అందించినా వ్యాధి నయంకాలేదు. ప్రతీనెలా మందులు తెప్పించుకుని వాడుతోంది. ఆమెకు భర్త లేడు. కుమార్తె, ఒక కుమారుడు ఉన్నాడు. కుమార్తెకు వివాహం కావడంతో అత్తవారింటికి వెళ్లిపోయింది. కుమారుడు గ్రామంలోనే చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ తల్లికి అండగా ఉంటున్నాడు. కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకునే స్థోమత ఆమెకు లేదు. ఇటువంటి వారికి సీఎం రిలీఫ్ ఫండ్‌కు ప్రతిపాదనలు చేయకపోవడం దారుణమన్నది గ్రామస్తుల వాదన.
అర్హులకు అందని సీఎం రిలీఫ్ ఫండ్!
కావాల్సినవారు, కమీషన్లు ఇచ్చేవారికే ఆర్థిక సహాయం!
పార్వతీపురంలో సహాయ నిధిపై చర్చ
మంచం పట్టిన వారికి అందని సాయం
పేదలకు అందించరా అంటూ ఆవేదన
డబ్బులున్నవారికే మళ్లీ ఆర్థిక సహాయం అంటూ నిట్టూర్పు
చిత్రంలో పక్షవాతంతో మంచం పట్టినది పత్తి లక్ష్ముం. ఈయన వయస్సు సుమారు 70 సంవత్సరాలు. ఇతనికి సెంటు భూమి లేదు. పూరిపాకలో జీవనం సాగిస్తున్నాడు. వైద్య ఖర్చులకు తెలిసిన కాడికి అప్పులు చేశాడు. ఆర్థికంగా చితికిపోయాడు. పూరిగుడిశలోనే దుర్భర జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు మాత్రం ఎలాంటి సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు కాలేదు. ఆయన పేరు సిఫార్సుచేసేవారు కూడా లేరు. ఇలాంటి వారికి సాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. ఎందుకంటే.. ఈయన వద్ద కమీషన్లు తీసుకోలేమన్న భావనతో సీఎం సహాయనిధి మంజూరు చేయడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


