పాఠశాలకు తాళం వేసి తల్లిదండ్రులతో కలిసి నిరసన
ఎంఈఓ హామీతో వెనక్కి తగ్గిన
నిరసనకారులు
గుమ్మలక్ష్మీపురం: విద్యాబుద్ధులు నేర్పని ముగ్గురు టీచర్లు మా కొద్దంటూ..విద్యార్థులతో పాటు తల్లి దండ్రులు నిరసన చేపట్టారు. గుమ్మలక్ష్మీపురం మండలంలోని గొయిపాక పంచాయతీ కుంతేసు గ్రామంలో ఈ సంఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మోడల్ స్కూల్‌గా మారింది. కాగా రెగ్యులర్ ఉపాధ్యాయులు ముగ్గురు ఉంటుండగానే..ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి బొబ్బిలి, విజ యనగరం నుంచి డిఫ్యుటేషన్‌పై ఇద్దరు ఉపాధ్యాయులను ఆ పాఠశాలకు నియమించారు. ఐదుగు రు ఉపాధ్యాయులున్న ఆ పాఠశాలలో ప్రస్తుతం 1 నుంచి 5 తరగతులకు చెందిన 54 మంది విద్యార్థులున్నారు. అయితే డిప్యుటేషన్‌పై వచ్చిన ఇద్దరు ఉపాధ్యాయులు కె.నాగభూషణరావు, వై.శ్రీనివాసరావు రెగ్యులర్‌గా పాఠశాల సమయానికే హాజరై విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తూ..సమయం పూర్తయ్యాకే వెళ్తుండగా..మిగిలిన ముగ్గురు రెగ్యుల ర్ ఉపాధ్యాయులు మాత్రం సమయానికి పాఠశాల కు హాజరుకాకపోవడం, లేటుగా రావడం, వచ్చినా ..కొద్దిసేపు ఉండి వెళ్లిపోతుండడం, విద్యార్థులకు పాఠాలు సక్రమంగా చెప్పకపోవడం, ప్రధానంగా పాఠశాలకు తాగివస్తుండడం, పాఠాలు చెప్పే టీచర్లతో గొడవలకు దిగడం వంటి చర్యలను గమనించిన గ్రామస్తులు ఆగ్రహింహించారు. పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని గురువారం పాఠశాలకు తాళం వేసి, పాఠశాల ఆవరణలోనే టెంటు వేసి విద్యార్థులతో పాటు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన కు దిగారు. తాగుబోతు టీచర్లు మాకొద్దు. వేరే టీచర్లు కావాలి. చక్కని విద్యను అందివ్వాలి. పాఠశాల పవిత్రతను కాపాడాలంటూ పీఎంసీ చైర్మన్ కిల్లక శంభు, వైస్ చైర్మన్ కిల్లక శ్రీను, కిల్లక రాజారా వు, గుంపస్వామి, జగ్గారావు డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు
తీసుకుంటాం
ఈ సమాచారం తెలుసుకున్న ఎంఈఓ సీహెచ్.శ్రీనివాసరావు కుంతేసు గ్రామానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి, తక్షణమే ఆ ముగ్గురు ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని, కుంతేసు నుంచి వేరే పాఠశాలలకు పంపివేస్తామని, వేరే పాఠశాలల నుంచి మరో ముగ్గురు ఉపాధ్యాయుల్ని డిప్యుటేషన్‌పై నియమిస్తామని హామీ ఇవ్వడంతో, కాసేపటికి గ్రామస్తులు నిరసన విరమించారు. ఇలాంటి చర్యలు పునరావృతం అయితే మరింత ఉధృతంగా నిరసనకు దిగుతామని గ్రామస్తులు ఈ సందర్భంగా హెచ్చరించారు.


