తీర్థయాత్రల పేరుతో యాత్రికులకు బురిడీ | - | Sakshi
Sakshi News home page

తీర్థయాత్రల పేరుతో యాత్రికులకు బురిడీ

Apr 8 2026 7:26 AM | Updated on Apr 8 2026 7:26 AM

వీరఘట్టం: తీర్థయాత్రల పేరుతో వీరఘట్టం కూరాకుల వీధికి చెందిన 40 మంది యాత్రికులను ఓ ట్రావెల్‌ బస్సు నిర్వాహకుడు బురిడీ కొట్టించిన ఉదంతం మంగళవారం వెలుగుచూసింది. ఈ నెల 5న వీరఘట్టం నుంచి 40 మంది యాత్రికులతో బయలుదేరిన బస్సు తిరిగి మంగళవారం తెల్లారేసరికి వీరఘట్టం చేరుకోవడంపై అంతా ఆశ్చర్యంగా ఏం జరిగిందని యాత్రికులను ఆరా తీశారు. వివరాలు ఇలా ఉన్నాయి. వీరఘట్టం కూరాకులవీధికి చెందిన 40 మంది యాత్రికులు శ్రీశైలం, షిర్డీ, మహానంది, అరుణాచలం, రామేశ్వరం, మధురై ఇలా పలు రకాల తీర్థయాత్రలకు 22 రోజులలో వెళ్లేందుకు కొమరాడ మండలం గుణానపురానికి చెందిన అచ్చుతరావు అనే వ్యక్తి వద్ద ఓ ట్రావెల్‌ బస్సును బుక్‌ చేశారు. ప్రతీ యాత్రికుడికు టికెట్‌ ధరను రూ.13 వేలుగా నిర్ణయించారు. దీంతో ఈ యాత్రికుల్లో ఉండే ఓ వ్యక్తి అందరి వద్ద రూ.5.20 లక్షలను కలెక్షన్‌ చేశాడు. ఇందులో రూ.1.20 లక్షలను బస్సు నిర్వాహకుడు అచ్చుతరావుకు అడ్వాన్స్‌గా ఇచ్చారు. ఈ నెల 5న తీర్థయాత్రలకు వెళ్లేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఇంతలోనే బుక్‌చేసిన బస్సుకు ఫైనాన్స్‌ ఇబ్బందులు ఉన్నందున మార్గమద్యలో కంపెనీ వాళ్లు బస్సును ఆపేయవచ్చని, యాత్రికులకు పలాసకు చెందిన మరో ట్రావెల్‌ బస్సును ఏర్పాటు చేస్తానని అచ్చుతరావు చెప్పడంతో యాత్రికులు సమ్మతించారు. ఈ నెల 5న పలాస నుంచి వచ్చిన ట్రావెల్‌ బస్సుకు రూ.30 వేల డీజిల్‌ కొట్టించారు. రూ.60 వేలు ఖర్చు చేసి టూర్‌లో భోజన వసతికి కావాల్సిన సామగ్రిని యాత్రికులు కొనుగోలు చేశారు. ఈ నెల 5న సాయంత్రం వీరఘట్టం నుంచి పార్వతీపురం మీదుగా యాత్రకు బయలుదేరారు. బస్సు బొబ్బిలి వద్ద బ్రేక్‌డౌన్‌ కావడంతో రూ.4 వేలు ఖర్చు చేసి బస్సుకు రిపేర్‌ చేశారు. ఇంతలో ఫైనాన్స్‌ కంపెనీ వారు బొబ్బిలి చేరుకుని అచ్చుతరావును తమ వెంటనే తీసుకుపోయారు.

తిరుగు ప్రయాణం

ఫైనాన్స్‌ కంపెనీ వారితో వెళ్లిన బస్సు నిర్వాహకుడు అచ్చుతరావు వెంటనే వచ్చేస్తాను.. మిమ్మల్ని విజయగనరంలో కలుసుకుంటానని చెప్పడంతో బస్సులో ఉన్న యాత్రికులు విజయనగరంలోని రామబాణం వద్దకు ఈ నెల 6న తెల్లవారుజామున చేరుకున్నారు. అక్కడ చాలా సేపు అచ్చుతరావు కోసం వేచి చూశారు. అచ్చుతరావు ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ కావడంతో రోజంతా ఎదురుచూశారు. తామంతా మోసపోయామని గమనించి పలాసకు చెందిన ట్రావెల్‌ బస్సులో వీరఘట్టం చేరుకున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని వీరఘట్టం ఎస్‌.ఐకు తెలియజేశారు. స్పందించిన ఎస్‌.ఐ షణ్ముఖరావు బస్సు నిర్వాహకుడితో మాట్లాడారు. వెంటనే వీరఘట్టం వచ్చి యాత్రికులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేయాలని చెప్పడంతో ఆయన వస్తానని చెప్పాడు. అయితే మంగళవారం ఎంత సేపటికి రాలేదు. అచ్చుతరావు వచ్చే వరకు బస్సును వీరఘట్టంలోనే ఉంచుతామన్నారు. ఏం జరుగుతుందో చూద్దామని యాత్రికులు తమ ఇళ్లకు వెళ్లిపోయారు.

మార్గమద్యలో యాత్రికులను వదిలేసిన ట్రావెల్స్‌ బస్సు నిర్వాహకుడు

చేసేదేమీ లేక ఇంటికి తిరుగు ప్రయాణం

వీరఘట్టం పోలీసులను ఆశ్రయించిన బాధితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement