పార్వతీపురం రూరల్: గిరిజన గడపలో సమస్యల సవ్వడి వినిపిస్తే.. అధికార యంత్రాంగం అప్రమత్తమై పరిష్కారం చూపాలన్నదే ప్రభుత్వ సంకల్పమని జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జ్ ప్రాజెక్టు అధికారి సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలోని గిరిమిత్ర ప్రాంగణంలో శుక్రవారం గిరిజన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం పీఓ అధ్యక్షతన నిర్వహించారు. వివిధ మండలాల నుంచి తరలివచ్చిన అడవి బిడ్డల ఆవేదనలు అర్జీల రూపంలో అధికారుల ముందుకు వచ్చాయి.
అర్జీల పరిశీలన.. పరిష్కారానికి ఆదేశాలు
ఈ వేదికపై 18 మంది గిరిజనులు తమ సామాజిక, ఆర్థిక, మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఇబ్బందులను విన్నవించుకున్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన పీఓ.. బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యల తీవ్రతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. అందిన ప్రతి వినతిని నిర్ణీత కాల పరిమితిలో పరిష్కరించాలని, ఇందులో అలసత్వానికి తావుండకూడదని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కార తీరును అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి యంత్రాంగం కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ ఎ.మురళీధర్‌తో పాటు పలు విభాగాల అధికారులు, వివిధ మండలాల గిరిజనులు పాల్గొన్నారు.


