20 వేల మందికిపైగా కోత..
అన్నదాతకు వంచనే.. అరకొరగానే ‘అన్నదాత సుఖీభవ’ నిధులు లబ్ధికి దూరమైన వేలాది మంది
అధికారులకు ఇచ్చిన వినతులు బుట్టదాఖలు
ఎకరాన్నరపైగా భూమిని కౌలు కు తీసుకుని సాగు చేస్తున్నాను. సేద్యంపై పెట్టుబడి డబ్బులు కూడా రావడం లేదు. ప్రభుత్వ సాయం లేదు. గత ప్రభుత్వంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రైతుల భరోసా వచ్చేది. ప్రస్తుతం రావడం లేదు. పలుమార్లు అధి కారులను కలసి విజ్ఞప్తులు ఇచ్చినా ఫలితం లేకపోతోంది. నాలాంటి రైతులు చాలా మంది ఉన్నారు.
– కె.గురుమూర్తి, కౌలురైతు,
లంబూరు గ్రామం, పాలకొండ
నాకున్న 84 సెంట్లతోపాటు, రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటున్నా. ఇదే మా కుటుంబ పోషణకు ఆధారం. గత ప్రభుత్వంలో రైతు భరోసా అందేది. ప్రస్తుతం ఎటువంటి ఆర్థిక సాయ మూ లభించడం లేదు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయాం. మదుపులు, కౌలు చెల్లించేందుకు చేతిలో చిల్లిగవ్వ ఉండటం లేదు. అప్పులపాలయ్యాను.
– తిర్లంగి సింహాచలం, రైతు,
గరుగుబిల్లి గ్రామం, పాలకొండ
సాక్షి, పార్వతీపురం మన్యం/పాలకొండ రూరల్:
పీఎం కిసాన్‌తోపాటు, అన్నదాత సుఖీభవ నిధులను శుక్రవారం రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. అధిక శాతం మందికి రాత్రయినా.. ఆ మొత్తం జమ కాలేదు. మరోవైపు రెండో విడత జమ చేసిన రైతులకే.. మూడో విడత కూడా లబ్ధి చేకూర్చారు. వివిధ సాంకేతిక సమస్యలు, ఇతర తప్పిదాల కారణంగా వేలాది మంది పథకానికి దూరమయ్యారు. వారంతా అప్పట్లోనే అధికారులను కలసి వినతిపత్రాలు అందజేశారు. పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పిన యంత్రాంగం.. ఏ ఒక్కరి విజ్ఞప్తినీ పరిగణనలోకి తీసుకోలేదని తాజా గణాంకాలే చెబుతున్నాయి. ఈసారి కూడా కౌలు రైతులకు ఉత్తచేయినే చూపారు. రైతాంగానికి పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ అవసరాల కోసం ఈ మొత్తం ఎంతగానో ఉపయోగపడుతుంది. పథకంలో కోత.. వారికి శాపంగా మారుతోంది.
అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.20 వేలు అందిస్తామన్న కూటమి ప్రభుత్వం... వివిధ కారణాలు చూపుతూ లబ్ధిదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. అధికారంలోకి వచ్చిన మొద టి ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను పూర్తిగా ఎగ్గొట్టింది. కేంద్రం అందించే పీఎం కిసాన్ నిధులు రూ.6 వేలే రైతుల కు అందా యి. రెండో ఏడాదిలో మొదటి విడత గత ఆగస్టులోనూ, రెండో విడత నవంబరులోనూ జమ చేశారు. ప్రస్తుతం కేంద్రం రూ.2 వేలు, రాష్ట్రం రూ.4 వేలు కలిపి మొత్తం రూ.6 వేలు జమ కావాల్సి ఉంది. జిల్లాలో ఈ–పంటను ప్రామాణికంగా తీసుకుని అన్నదాత సుఖీభవ పథకానికి గత ఆగస్టులో 1,22,260 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. లబ్ధిదారుల వివరాలను ప్రదర్శించి, అభ్యంతరాలు కూడా స్వీకరించారు. ప్రస్తుతం కూడా మూడో విడత కింద 1,22,268 మంది రైతుల ఖాతాల్లో రూ.71.03 కోట్ల సాయాన్ని జమ చేస్తున్నట్లు ప్రకటించారు. వీరిలో పీఎం కిసాన్‌తోపాటు, అన్నదాత సుఖీభవ తీసుకుంటున్న వారు 1,10,650 మంది. ఒకటి, రెండో విడతల తర్వాత అర్హత కోల్పోయిన వందలాది మంది ఇచ్చిన విజ్ఞప్తులు బుట్టదాఖలే అయ్యాయి. ఒకట్రెండు విడతల్లో కొంతమందికి పీఎం కిసాన్ వాటా రూ.2 వేలే బ్యాంకు ఖాతాకు జమైంది. రాష్ట్ర వాటా అందలేదు. ఇదే విషయమై సచివాలయాల్లోనూ, కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లోనూ పలు మండలాల రైతులు వినతిపత్రాలు అందించారు. వారిలో ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదు. పీఎం కిసాన్‌కు అర్హులైన తాము.. అన్నదాత సుఖీభవకు ఎందుకు అనర్హులవుతామంటూ అధికారులను ప్రశ్నించారు. ఆధార్ నమోదు సక్రమంగా లేకపోవడం, భూమికి వేరే ఆధార్‌తో లింకు కావడం, పాస్ పుస్తకంలో పేరు మారకపోవడం, మ్యుటేషన్, వెబ్‌ల్యాండ్‌లో సమస్యలతో కొంతమంది పథకానికి దూరమయ్యారు. వారి సమస్యలు నేటికీ అలానే ఉండిపోయాయి.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అన్ని సంవ త్సరాలూ రైతుభరోసా నిధులు కర్షకులకు సకాలంలో అందేవి. గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా పథకం కింద ఏడాదికి 1.45 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. చంద్ర బాబు ప్రభుత్వం వివిధ కారణాలు చూపుతూ 23 వేల మందికిపైగా కుదించింది. జిల్లాలో 10 వేల మందికిపైగా కౌలురైతులు ఉన్నారు. పథకంలో నిబంధనల కారణంగా వీరెవరికీ నిధులు అందడం లేదు. ‘కౌలుకు తీసుకున్నా.. ఖర్చులన్నీ పెట్టుకునేది మేమే. నష్టం వస్తే భరించేది మేమే.. అన్నదాత సుఖీభవ నిధులు గానీ, నష్ట పరిహారం గానీ మాకు ఎందుకు ఇవ్వడం లేద’ని వారంతా ప్రశ్నిస్తున్నారు.


