ట్రాక్టర్‌ బోల్తా | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ బోల్తా

Mar 14 2026 7:36 AM | Updated on Mar 14 2026 7:36 AM

బొండపల్లి: మండల కేంద్రానికి సమీపంలో చలి చెరువు వద్ద జాతీయ రహదారిపై బొండపల్లి నుంచి గజపతినగరం వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి శుక్రవారం బోల్తా పడింది. వివరాలు.. బొండపల్లి గ్రామానికి చెందిన వీరాస్వామి, బంగారయ్య, చంద్రరావు ట్రాక్టర్‌ ట్రక్కులో వస్తుండగా చలి చెరువు అదుపు తప్పి బోల్తా పడి ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. వీరిని గజపతినగరంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉంది.

ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొని వ్యక్తి దుర్మరణం

పూసపాటిరేగ : భోగాపురం మండలం పోలిపల్లి వద్ద ఆగి వున్న లారీని ఆటో వెనుక నుంచి వచ్చి ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్లే.. శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళ్తున్న ఆటో పోలిపల్లి సమీపంలో ఆగి వున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న శీల రాంబాబు మృతి చెందాడు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. భోగాపురం సీఐ కె.దుర్గాప్రసాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మద్యం దుకాణంలో చోరీ

బొండపల్లి: మండల కేంద్రంలోని నవీన్‌ వైన్స్‌ దుకాణంలో శుక్రవారం వేకువజామున చోరీ జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గురువారం రాత్రి మద్యం దుకాణం మూసేసిన తరువాత సిబ్బంది ఇంటికి వెళ్లిపోగా శుక్రవారం తెల్లవారుజామున దొంగలు తాళాలను విరగ్గొట్టినట్టు స్థానికులు గుర్తించి పోలీసులకు, షాపు నిర్వాహకులకు సమాచారం అందజేశారు. దీంతో ఎస్‌ఐ యు.మహేష్‌తో పాటు సిబ్బంది వెళ్లి పరిశీలించగా షాపులో ఉంచిన రూ.12వేల నగదు అపహరించుకుపోయినట్టు గుర్తించారు. విజయనగరం నుంచి క్లూస్‌ టీం వచ్చి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. షాపులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను పరిశీలించి నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వ్యక్తి ఆత్మహత్య

పాలకొండ: మండలంలోని కొండాపురం గ్రామానికి చెందిన కల్లేపల్లి గణపతి(39) గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాకుళంలోని తపాల శాఖలో విధులు నిర్వహిస్తున్న గణపతి బుధవారం విధులు ముగించుకుని ఇంటికి వచ్చి అర్ధరాత్రి సమయంలో గడ్డి మందు తాగడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు గుర్తించి పాలకొండలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. భార్య నిరోషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై వెంకన్న తెలిపారు. కడుపునొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారని వివరించారు. మృతుడికి భార్య నిరోషాతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

రైతులకు అండగా ప్రభుత్వం

గజపతినగరం: వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ప్రతీ రైతు పక్షాన తెలుగుదేశం పార్టీ (కూటమి ప్రభుత్వం)అండగా ఉంటుందని డీసీసబీ చైర్మన్‌ కిమిడి నాగార్జున అన్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ఉన్న ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో శుక్రవారం జరిగిన నియోజకవర్గ స్థాయి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌ మూడో విడత నగదు అందజేసే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులకు పెట్టుబడి సాయంతో పాటు అనేక రకాల ప్రయోజనాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయన్నారు. ఈ సందర్భంగా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌ చెక్కును విడుదల చేశారు. వ్యవసాయ శాఖ ఏడీఏ ఎ.నిర్మలాజ్యోతి, ఏఓ కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

కేసు నమోదు

రాజాం సిటీ: మండల పరిధి ఆగూరు కంచరాం గ్రామంలో అక్రమంగా పీడీఎస్‌ బియ్యం తరలిస్తున్న వ్యాపారం నిర్వహిస్తున్న వ్యక్తిపై శుక్రవారం కేసు నమోదు చేశామని టౌన్‌ సీఐ కె.అశోక్‌కుమార్‌ తెలిపారు. ఆగూరు కంచరాంలో పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్టు విజిలెన్స్‌ అధికారులకు సమాచారం రావడంతో రెవెన్యూ అధికారులతో ఈ నెల 6న దాడి నిర్వహించారు. గ్రామానికి చెందిన మురపాక శ్రీను ఇంటి వద్ద ఆటోలో రవాణాకు సిద్ధం చేసిన 603 కేజీల బియ్యాన్ని పట్టుకుని స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారని తెలిపారు. ఈ మేరకు సీఎస్‌డీటీ అనంతకుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement