జిల్లా కేంద్రంలో ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’
● నేటి నుంచి నిబంధనలు కఠినతరం
● ద్విచక్ర వాహనం కదలాలంటే.. హెల్మెట్ ధరించాల్సిందే..
● పెట్రోల్ బంకు యజమానులకు పోలీసుల దిశానిర్దేశం
పార్వతీపురం రూరల్ : రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారుల ప్రాణాలకు రక్షణ కవచంలా నిలిచే హెల్మెట్ వినియోగాన్ని పార్వతీపురం మన్యం జిల్లా పోలీసులు అనివార్యం చేశారు. కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా, సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కరించే దిశగా ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ద్విచక్ర వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ విధానాన్ని జిల్లా కేంద్రంలో పకడ్బందీగా అమలు చేయనున్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు ఇప్పటికే జిల్లా కేంద్రంలోని అన్ని పెట్రోల్ బంకుల వద్ద ‘నో హెల్మెట్ – నో పెట్రోల్‘ అంటూ రాసి ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వాహనదారులు బంకులోకి ప్రవేశించగానే ఈ నిబంధన కనబడేలా, స్పష్టమైన హెచ్చరికలతో కూడిన బ్యానర్లను కట్టించారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ట్రైల్ రన్‌గా అమలు జరుగుతుంది. సోమవారం నుంచే ఈ నిబంధన క్షేత్ర స్థాయిలో అమల్లోకి రానుంది.
ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనదారుల క్షేమమే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే పట్టణంలోని అన్ని పెట్రోల్ బంకుల వద్ద ‘నో హెల్మెట్ – నో ఫ్యూయల్’ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాం. సోమవారం నుంచి ఈ నిబంధనను జిల్లా కేంద్రంలో అత్యంత పకడ్బందీగా, పక్కాగా అమలు చేస్తాం. ఈలోగా వాహనదారుల్లో మార్పు రావడం కోసం సోమవారం వరకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నాం. సామాజిక మాధ్యమాల ద్వారా కూడా యువతకు, వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నాం. హెల్మెట్ లేనిదే పెట్రోల్ లభించదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. బంక్ సిబ్బంది కూడా వాహనదారులతో ఘర్షణ పడకుండా, ఇది వారి ప్రాణ రక్షణ కోసమేనని సున్నితంగా వివరిస్తూ సహకరించాలి.
– బి.వెంకటరావు, సీఐ, పార్వతీపురం
జిల్లా కేంద్రంలో ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’


