అట్టడుగు వర్గాలకు చేరువగా న్యాయం
పార్వతీపురం రూరల్: న్యాయమూర్తులకు, సామాన్య ప్రజలకు మధ్య ఉన్న అగాధాన్ని తొలగించి, బాధితుల ముంగిటకే న్యాయ సహాయాన్ని అందించడమే లక్ష్యమని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జస్టిస్ సిహెచ్. మానవేంద్రనాధ్ రాయ్ పేర్కొన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని రెవెన్యూ క్లినిక్ వద్ద ఏర్పాటు చేసిన ఉచిత న్యాయ సహాయ కేంద్రం (లీగల్ ఎయిడ్ క్లినిక్)ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి వర్గాలకు ఉచితంగా న్యాయ సేవలు అందించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్టు తెలిపారు. న్యాయమూర్తులను కేవలం ఒక జడ్జిగా కాకుండా సమస్యలు పరిష్కరించే అధికారిగా భావించి సంప్రదించాలని కోరారు. ప్రతి సోమవారం సీనియర్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు ఇక్కడ అందుబాటులో ఉంటారని, బాధితులకు అర్జీలు రాయడం దగ్గర నుంచి పరిష్కారం లభించే వరకు వారు తోడ్పాటునందిస్తారని వివరించారు. ముఖ్యంగా సివిల్, క్రిమినల్ కేసుల్లో సలహాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన, లోక్ అదాలత్ ద్వారా వివాదాల పరిష్కారం వంటి సేవలు ఇక్కడ ఉచితంగా లభిస్తాయని స్పష్టం చేశారు.
న్యాయ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ పథకాలను పటిష్టంగా అమలు చేయాలని ఆయన సూచించారు. కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ.. ప్రజా ఫిర్యాదుల విభాగంలో వచ్చే భూ సమస్యల్లో సుమారు 9 శాతం సివిల్, కుటుంబ వివాదాలకు సంబంధించినవే ఉంటున్నాయని, వీటి పరిష్కారం కోసమే రెవెన్యూ క్లినిక్‌కు అనుబంధంగా ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. భూ వివాదాలను కోర్టుల వరకు వెళ్లకుండా ప్రీ–లిటిగేషన్ దశలోనే మధ్యవర్తిత్వం ద్వారా స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత, రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్.దామోదరరావు, జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్, జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, ఏఎస్పీ వి.మనీషారెడ్డి, తహసీల్దార్లు, న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.
పార్వతీపురంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభం
ప్రజల ముంగిటకే న్యాయమూర్తులు : జస్టిస్ మానవేంద్రనాధ్ రాయ్


