గజరాజుల విధ్వంసం
సీతానగరం మండలంలోని పలు గ్రామాల్లో గజరాజులు గడిచిన నాలుగు రోజులుగా విధ్వంసం సృష్టిస్తున్నాయి. తామరఖండి, బగ్గందొరవలస, బల్లకృష్ణాపురం, బక్కుపేట, ఆర్.వెంకంపేట గ్రామాల్లో ఎనిమిది గజరాజుల గుంపు సంచరిస్తూ పంట పొలాలను, పలు తోటలను, విద్యుత్ పరికరాలను, ధాన్యం బస్తాలను ధ్వంసం చేస్తూ రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. శనివారం రాత్రి బక్కుపేటలోని పలువురు రైతులకు చెందిన 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పామాయిల్ తోటల్లో మొక్కలను ఐదెకరాల్లో ధ్వంసం చేశాయి. విద్యుత్ మోటార్లకు సంబంధించి పైపులైన్లు పీకేశాయి. ఆదివారం వేకువజామున ఆర్.వెంకంపేట గ్రామంలో కల్లాల్లో ఉన్న ధాన్యం బస్తాలను ధ్వంసం చేశాయి. దీంతో రైతులు గొల్లుమంటున్నారు. తమకు ఎన్నాళ్లీ కష్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు ఎప్పటికీ వీటిని తరలిస్తారని.. ఎన్నాళ్లీలా నష్టపోవాలని బోరుమంటున్నారు. – సీతానగరం


