సూర్యనారాయణమూర్తి దేవాలయంలో హైకోర్టు జడ్జి పూజలు
కొమరాడ: మండలంలోని శివిని పంచాయతీ సూర్యాపీఠం వద్ద ఉన్న సూర్యనారాయణమూర్తి దేవాలయంలో రథసప్తమి సందర్భంగా పీఠాధిపతులు నరహరశాస్త్రి ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా నలుమూలల నుంచే కాక ఒడిశా రాష్ట్రం నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనార్థం తరలివచ్చారు. హైకోర్టు జడ్జి సీహెచ్ మానవేంద్రనాధ్‌రాయ్ స్వామివారిని దర్శించుకున్నారు.ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు నరహరిశాస్త్రి శిష్య బృందం సాదర స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఓటు వజ్రాయుధం
● ప్రజాస్వామ్యానికి ప్రాణం..: కలెక్టర్
పార్వతీపురం రూరల్ : ప్రజాస్వామ్య సౌధానికి ఓటు హక్కు పునాది వంటిదని, పటిష్ట భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం స్థానిక ఆర్సీఎం ప్రభుత్వ కార్యాలయాల సముదాయం నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులు చైతన్య ర్యాలీ నిర్వహించారు. ‘ఓటు మన హక్కు కాదు – బాధ్యత‘, ‘నిజాయితీగా ఓటు వేద్దాం – ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం‘ అంటూ విద్యార్థులు చేసిన నినాదాలు పట్టణ వీధుల్లో చైతన్యాన్ని నింపాయి. అనంతరం కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉండాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటును అమ్ముకోకుండా ప్రజలను చైతన్యపరిచే బాధ్యతను విద్యార్థులు భుజానికెత్తుకోవాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో కనీసం ఒక్క కుటుంబానికైనా ఓటు విలువను వివరించాలని హితవు పలికారు. అనంతరం సీనియర్ సిటిజన్ ఓటర్లను ఘనంగా సన్మానించారు. కొత్త ఓటర్ల నమోదులో విశేష సేవలందించిన బీఎల్‌ఓలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు జ్ఞాపికలను బహూకరించారు. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల విద్యార్థి నులు ప్రదర్శించిన నాటిక, విద్యార్థినులు వాసవి, మోనికా వైష్ణవి ప్రసంగాలు ఓటు హక్కు ప్రాముఖ్యతను కళ్లకు కట్టాయి. పార్వతీపురం పాలకొండ సబ్ కలెక్టర్లు వైశాలి, పవార్ స్వప్నిల్, డీఆర్‌ఓ కె.హేమలత, వివిధ శాఖల జిల్లా అధికారులు తహసీల్దార్ సురేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
హామీల అమలుకు ఎస్‌టీయూ పోరుబాట
సీతంపేట: కూటమి ప్రభుత్వం కొలువుదీరి 20 నెలలు కావస్తున్నా.. ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం చెందిందని ఎస్‌టీయూ రాష్ట్ర గిరిజన విభాగం కో కన్వీనర్ కుండంగి ప్రమోద్‌కుమార్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాలక పురుషోత్తం, మజ్జి మురళీబాబు ఆదివారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. హామీల అమలుకు పోరుబాట పట్టనున్నట్టు వెల్లడించారు. మొదటి దశలో ఈ నెల 30న తహసీల్దార్లకు వినతిపత్రాలు, రెండో దశలో ఫిబ్రవరి 10న జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నా, మూడో దశలో వచ్చే నెల ఫిబ్రవరి 25న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించనున్నామని తెలిపారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్, పీఎఫ్‌లు వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు.
సాగునీటి సరఫరా పెంపు
వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయు డు ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ ద్వారా రబీ పంటల సేద్యానికి అధికారులు సాగునీటి సరఫరా పెంపుదల చేశారు. ఆయకట్టు పరిధిలో సాగునీటి అవసరం దృష్ట్యా ఆదివారం మరో 50 క్యూసెక్కులు పెంచి 450 క్యూసెక్కుల సరఫరా చేస్తున్నారు. ప్రాజెక్టు వద్ద 64.48 మీటర్లు లెవెల్ నీటి నిల్వ ఉందని, ఆయకట్టు పరిధిలో జిల్లాలోని వంగర 996 ఎకరాలు, రేగిడి ఆమదాలవలస 6777 ఎకరాలు, సంతకవిటిలో 6599 ఎకరాలు, శ్రీకాకుళం జిల్లా జి.సిగడాంలో 3029 ఎకరాలు, పొందూరులో 99 ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నట్టు ఏఈ నితిన్ తెలిపారు.


