ఇంటి దొంగలు..! | - | Sakshi
Sakshi News home page

ఇంటి దొంగలు..!

Jan 10 2026 9:25 AM | Updated on Jan 10 2026 9:25 AM

ఇంటి దొంగలు..!

ఇంటి దొంగలు..!

ఇంటి దొంగలు..!

వీరఘట్టం: ప్రతికుటుంబం తమకు సొంత ఇల్లు ఉండాలనుకుంటుంది. సొంతింటి నిర్మాణం కోసం సామాన్య, మధ్య తరగతి వారు నానా తంటాలు పడుతూ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. ఎంతో కష్టపడి ఇళ్ల నిర్మాణం చేపడుతున్న వారికి ఇంటి నిర్మాణం కోసం కావాల్సిన ప్లాన్‌ అప్రూవల్‌ కోసం నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఒకప్పుడు గ్రామాల్లో నిర్మించే ఇళ్లకు పంచాయతీ అనుమతి తీసుకునేవారు. ఇప్పుడు కొత్తగా వీరఘట్టం మండలం సుడా (శ్రీకాకుళం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) పరిధిలోకి వచ్చింది. దీంతో ఇళ్ల నిర్మాణం చేపట్టేవారు ముందుగా సుడా అనుమతులు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. అయితే నేరుగా సుడా అధికారులు ఈ అనుమతులు ఇవ్వడం లేదు.ఇళ్ల నిర్మాణాల అనుమతుల ప్రక్రియను థర్డ్‌ పార్టీ వారికి (ప్రైవేట్‌ ఏజెన్సీలకు) అప్పగించారు. దీంతో ఈ ప్రైవేట్‌ ఏజెన్సీలు తాము చెప్పిందే వేదం. తాము అడిగినంత సర్వీసు చార్జీలు ఇవ్వాల్సిందేనని లబ్ధిదారుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. సుడా నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణం చేపట్టాలంటే గ్రామీణ ప్రాంతాల్లో సాధ్యం కాదు. ఎందుకంటే ఇక్కడ పక్కపక్కనే ఇళ్ల నిర్మాణాలు జరుగుతుంటాయి. ఇక్కడ ఉన్న చిన్న చిన్న లోటుపాట్లను ఈ ప్రైవేట్‌ ఏజెన్సీలు సొమ్ము చేసుకుంటూ అడ్డుగోలుగా లబ్ధిదారులను దోచుకుంటున్నాయి.

కొరవడిన పర్యవేక్షణ

సుడా పరిధిలో పనిచేస్తున్న ప్రైవేట్‌ ఏజెన్సీలపై పర్యవేక్షణ కొరవడడంతో వారు చెప్పినంత ఇవ్వాల్సి వస్తోందని స్థానికులు మండిపడుతున్నారు. ఇలా అయితే ఇల్లు కట్టడం మాట పక్కన పెడితే సుడా అనుమతులకే బడాగా సొమ్ములు అవుతున్నాయని గృహవాసులు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఇల్లు కట్టుకోవాలంటే అనుమతులకే రూ.లక్షలు ఖర్చవుతున్నందున సామాన్యులకు అందుబాటులోకి ఉండేందుకు వీరఘట్టం మండలాన్ని సుడా నుంచి మినహాయించాలని కోరుతున్నారు.

నిబంధనల పేరుతో..నిలువుదోపిడీ..

సుడా పరిధిలో ఉన్న పైవేట్‌ ఏజెన్సీలు ఇంటి నిర్మాణ అనుమతుల పేరిట సర్వీసు చార్జీల పేరిట నిలువుదోపిడీ చేస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇటీవల వీరఘట్టం, నడుకూరు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలకు పలువురు లబ్ధిదారులు సుడా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇందులో 1శాతం లేబర్‌ సెస్‌ చార్జీలు, పంచాయతీ సెస్‌ చార్జీల(ప్రాంతాల వారీగా ఈ చార్జీలు మారుతాయి),తో పాటు 14 శాతం వ్యవసాయ భూములు, లే–ఔట్‌ భూములపై నిబంధనల ప్రకారం చలానాలు తీయిస్తున్నారు. అయితే ఇందులో సర్వీసు చార్జీల పేరిట అంతకు మించి వీరు వసూలు చేయడంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. ప్రైవేట్‌ ఏజెన్సీల వసూళ్లకు సుడా అధికారులు కళ్లెం వేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

కాగితాలకే పరిమితమైన నిబంధనలు..

గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మించే నివాస గృహాలు 300 చదరపు మీటర్లు లోపు నిర్మిస్తే అటువంటి గృహాలకు సుడా అనుమతి అక్కర్లేదని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. ఈలెక్కన గ్రామ పంచాయతీ అనుమతి తీసుకుంటే సరిపోతుందని నిబంధనలు చెబుతున్నాయి. వ్యాపార భవనాలు, సుముదాయాలు నిర్మిస్తే మాత్రం సుడా అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే సుడా పరిధిలో పనిచేస్తున్న పైవేట్‌ ఏజెన్సీలు గృహనిర్మాణాలను, వ్యాపార సముదాయాలను ఒకే పరిగణనలోకి తీసుకుని వారితో అనవసరమైన ఖర్చులు పెట్టించి అడ్డుగోలు దోపిడీ చేస్తున్నాయని లబ్ధిదారులు మండిపడుతున్నారు. సుడా అనుమతుల కోసం ఎక్కడా కచ్చితమైన నిబంధనల బోర్డులు లేకపోవడంతో ప్రైవేట్‌ ఏజెన్సీలు ఇష్టారాజ్యం దోపిడీ చేస్తున్నాయి. ఇప్పటికై నా సుడా అధికారులు స్పందించి అన్ని పంచాయతీ కార్యాలయాల వద్ద సుడా నిబంధనల బోర్డులు పెట్టాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

‘సుడా’ అనుమతికి భారీగా సొమ్ము వసూలు

రెచ్చిపోతున్న ప్రైవేట్‌ ఏజెన్సీలు

పట్టించుకోని సుడా అధికారులు

వీరఘట్టం మండలాన్ని సుడా నుంచి మినహాయించాలంటున్న స్థానికులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement