ఉల్లాసంగా.. ఉత్సాహంగా...
చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ కళాశాలలో గత ఐదు రోజులుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న అంతర కళాశాలల క్రీడా సాంస్కృతిక సాహిత్య పోటీలు ఒకవైపు ఉత్సాహంగా మరోవైపు ఉత్కంఠగా సాగాయి. 14వ విశ్వవిద్యాలయ క్రీడాసాంస్కతిక పోటీల్లో భాగంగా వివిధ కళాశాలల నుంచి హాజరైన విద్యార్థులు ప్రదర్శించిన క్రీడా, సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు ఫైనల్స్‌కు చేరుకోవటంతో అంతటా ఉత్కంఠ నెలకొంది. ఈ సందర్భంగా ఫైనల్స్‌లో అధ్లెటిక్స్‌లో విజేతలుగా నిలిచిన విద్యార్థిని, విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ క్రీడా పోటీల్లో ఫైనల్స్‌కు చేరుకుని 1500 మీటర్ల పరుగు పందెంలో బాలుర విభాగంలో గరివిడి వెటర్నరీ కళాశాల బంగారు పతకం సాధించగా 5000 మీటర్ల పరుగు పందెంలో తిరుపతి కళాశాల బంగారు పతకం సాధించింది. అదే విధంగా లాంగ్‌జంప్‌లో డైరీ టెక్నాలజీ కళాశాల విజేతులగా నిలిచి బంగారు పతకం కై వసం చేసుకున్నారు. 1500 మీటర్ల పరుగు పందెంలో బాలికల విబాగంలో తిరుపతి కళాశాల, 5000 మీటర్ల పరుగుపందెంలో గరివిడి వెటర్నరీ కళాశాలలు విజేతలుగా నిలిచి బంగారు పతకాలు సాధించారు. లాంగ్ జంప్‌లో తిరుపతి కళాశాల, షాట్పుట్‌లో ప్రొద్దుటూరు కళాశాలలు విజేతలుగా నిలిచారు. బాల్ బ్యాడ్మింటన్‌లో బాలికల విబాగంలో గరివిడి వెటర్నరీ కళాశాల ఘన విజయం సాధించగా, బాలుర విభాగంలో తిరుపతి కళాశాల విజేతలుగా, గరివిడి వెటర్నరీ కళాశాల రన్నర్స్‌గా నిలిచారు. లిటరరీ విభాగంలో నిర్వహించిన వ్యాసరచన, డిబేట్ పోటీల్లో అన్ని కళాశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనటమే కాకుండా సాంస్కృతిక పోటీల్లో విద్యార్థులు తమ సృజనాత్మకతను చూపించారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన ఏకపాత్రాబినయం, లఘ చిత్రప్రదర్శన, మూఖాభినయం వంటి విభిన్న కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కళాశాల అసోసియేట్ డీన్ మక్కేన శ్రీను ఆధ్వర్యంలో జరుగుతున్న క్రీడా సాంస్కృతిక సమ్మేళనంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ హెడ్ డా.బి.జయచంద్ర, ఆఫీసర్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డా.వైఆర్.అంబేడ్కర్ సమర్ధవంతంగా క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు.


