ప్రమాదవశాత్తు మాజీ సర్పంచ్ మృతి
చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి మండలంలోని కోడూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ అడపా సూర్యనారాయణ(52) ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో పడి మృతి చెందాడు. దీనికి సంబంధించి గరివిడి పోలీసులు తెలిపిన వివరాలు.. మృతుడు సూర్యనారాయణ బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు వాకింగ్‌కు వెళ్లారు. ఆ రోజు ఉదయం 11 గంటలు సమయమైనా సరే తిరిగి ఇంటికి రాలేదని మృతుని భార్య అడపా జానకీరవణమ్మ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన ఆచూకీ కోసం చర్యలు చేపట్టామని తెలిపారు. శుక్రవారం ఉదయం కోడూరు గ్రామానికి సమీపంలో ఉన్న క్వారీ గుంతలో మృతదేహం తేలి ఉండటంతో స్థానికులు గమనించి సమాచారం అందించారని చెప్పారు. ఈ మేరకు మృతదేహాన్ని చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి శవ పంచనామా నిమిత్తం తరలించామని, ఫిర్యాదు మేరకు ప్రమాదవశాత్తు మృతి చెందినట్టు కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తామన్నారు.
అనుమానాలున్నాయి...
మాజీ సర్పంచ్ సూర్యనారాయణ మృతి పట్ల అనుమానాలున్నాయని, వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు అన్నారు. చీపురుపల్లి సీహెచ్‌సీకి వచ్చిన ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యనారాయణ మృతి పట్ల నిజాలు నిగ్గు తేల్చాలని పోలీసులను ఆదేశించారు.
ప్రమాదవశాత్తు మాజీ సర్పంచ్ మృతి


