జానపద జాతరకు.. మన్యం కళావేదిక
పార్వతీపురం రూరల్/టౌన్: జిల్లాలోని కళాకారుల ప్రతిభకు గుర్తింపునిచ్చే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన మన్యం కళావేదికను రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గురువారం పార్వతీపురంలో ప్రారంభించారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముందస్తు సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన భోగి మంటలు, సాంప్రదాయ వేడుకలు అలరించాయి. నేటి తరం పిల్లలు సాంకేతిక పరికరాలకు పరిమితం కాకుండా మన ఆచారాలను కాపాడుకోవాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ, జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారిగా కళాకారుల కోసం ఈ ప్రత్యేక వేదికను, సోషల్ మీడియా ఛానళ్లను ప్రారంభించినట్టు తెలిపారు. 64 కళల్లో ప్రావీణ్యం ఉన్న స్థానిక ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఇది దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తదితరులు పాల్గొని మన సంస్కృతిని కాపాడడంలో జిల్లా యంత్రాంగం చూపిస్తున్న చొరవను ప్రస్తావించారు. అనంతరం కళావేదిక వేదికగా జరిగిన జిల్లా స్థాయి నృత్య పోటీల ముగింపు కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, వివిధ శాఖల అధికారులు, ప్రముఖ కవులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు.
జానపద జాతరకు.. మన్యం కళావేదిక


