
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లాకు పతకాలు
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు పతకాలు సాధించారు. జాతీయ క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకుని శాప్ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన పోటీల్లో జిల్లా నుంచి పాల్గొన్న క్రీడాకారులు రెండు బంగారు, రెండు వెండి, ఒక కాంస్య పతకం కై వసం చేసుకున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు లీలాకృష్ణ, శ్రీకాంత్‌లు తెలిపారు. పతకాలు సాధించిన వారిలో పి.వసంత, ఎస్.దివ్యవాణి, ఎస్.శ్రావణి, బి.నీలిమ, పి.పవన్‌కల్యాణ్‌లు ఉన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన క్రీడాకారులను జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి శ్రీధర్ అభినందించారు.
కిమిడి సోదరుడి మృతి
రేగిడి: మండల కేంద్రం రేగిడి గ్రామానికి చెందిన కిమిడి నీలంనాయుడు (71) సోమవారం ఉద యం అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు, మాజీ ఎమ్మెల్యే కిమిడి గణపతిరావుకు స్వయానా సోదరుడు. నీలంనాయుడు గతంలో సర్పంచ్‌గా పనిచేశారు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
చిట్టీల పేరుతో టోకరా
భోగాపురం: మండలంలోని సిమ్మపేట గ్రామానికి చెందిన ఒక వ్యక్తి రూ.22 లక్షలు చిట్టీలు వేసి ఉడాయించేందుకు సిద్ధమవ్వగా చిట్టీలు వేసిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్సై పాపారావు ఇరు వర్గాలను పిలిపించి విచారణ చేపట్టగా చిట్టీలు వేసిన వ్యక్తి ఆన్‌లైన్ బెట్టింగ్ అడడం వల్ల డబ్బులు పోయి అప్పుల్లో మునిగిపోయానని చెప్పాడు. తాను ఎవరిని మోసం చేయనని, అప్పులు తీర్చేద్దామని సిమ్మపేటలో తనకున్న ఇల్లును ఇతరులకు అమ్మేయగా వచ్చిన ఆ డబ్బులను పెద్దమనుషుల దగ్గర ఉంచానని చెప్పాడు. ఇంతలో బాధితులంతా కలిసి అప్పులు తీర్చమని అడగ్గా వారికి చిట్టీల నిర్వాహకుడు రాసి ఇచ్చిన ప్రాంసరీ నోట్లను పోలీసులకు చూపించి తమకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లాకు పతకాలు