
నిబంధనలు పాటించకపోగా అవమానం
● మున్సిపల్ కమిషనర్‌పై చైర్‌పర్సన్ ఫిర్యాదు
పార్వతీపురం రూరల్: తానొక ప్రథమ పౌరురాలు, బీసీ నేత అని చూడకుండా, ప్రోటోకాల్ పాటించకుండా ఉద్దేశ పూర్వకంగా నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్షంగా వ్యవహరిస్తూ తనను మున్సిపల్ కమిషనర్ జి.శ్రీనివాసరాజు అవమాన పరుస్తున్నారని పార్వతీపురం మున్సిపల్ చైర్‌పర్సన్ బోను గౌరీశ్వరి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఎస్‌ఎస్ శోభికకు తనకు జరిగిన అవమానాన్ని వినతిపత్రంలో వివరించారు. ఇటీవల జరిగిన స్వాతంత్య్ర దినం కార్యక్రమంలో ఉదయం 7.30గంటలకు కార్యక్రమానికి రమ్మని కార్యాలయం నుంచి తనకు ఆహ్వానం పంపి మళ్లీ ఫోన్ చేసి 9గంటలకు హాజరు కావాలని సమాచారం అందించారని, తాను 9 గంటలకు వెళ్లగా శాసనసభ్యులు రాలేదని తనతో పాటు తోటి కౌన్సిల్ సభ్యులను నిరీక్షించమని చెప్పి 10 గంటల వరకు కాలయాపన చేశారన్నారు. అనంతరం నిబంధనలకు విరుద్ధంగా పట్టణ ప్రథమ పౌరురాలైన తనతో జాతీయజెండాను ఎగురవే యించాల్సిన నేపథ్యంలో కావాలని ఉద్దేశపూర్వకంగా చైర్‌పర్సన్ అయిన తనను అవమాన పరుస్తూ శాసనసభ్యుడితో ఎగురవేయించారని తెలిపారు. అలాగే పట్టణ పరిధిలో ఈ నెల 20న బైపాస్ రోడ్డులో జరిగిన సీసీ కాలువ భూమి పూజ కార్యక్రమానికి ప్రోటోకాల్ నిబంధనలు పాటించకుండా కావాలనే తనను అవమానపరుస్తున్నారని చైర్‌పర్సన్ గౌరీశ్వరి తెలిపారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికై న తనపై కమిషనర్ శ్రీనివాసరాజు ప్రోటోకాల్ ఉల్లంఘన కింద ఈ విధంగా ప్రవర్తించకుండా తగుచర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. అలాగే ప్రాంతీయ మున్సిపల్ సంచాలకుడికి ఫిర్యాదు చేస్తున్నట్లు ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు.