
దివ్యాంగుల జీవితాలతో ఆడుకోవద్దు
● తొలగించిన పింఛన్లు వెంటనే పునరుద్ధరించాలి ● మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు
పార్వతీపురం రూరల్: రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులపై ఆధారపడుతున్న వేలాదిమంది దివ్యాంగుల పింఛ న్ల రద్దుకు కూటమి ప్రభుత్వం పూనుకోవడం దుర్మార్గమని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ధ్వజమెత్తారు. రీ సర్వే పేరుతో దివ్యాంగుల పింఛన్ల రద్దును నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు ప్రసాద్, పలువురు దివ్యాంగులతో కలిసి కలెక్టరేట్ వద్ద సోమవారం ఆందోళన చేశారు. అనర్హత పేరుతో అర్హులైన దివ్యాంగుల పింఛన్లను తొలగించవద్దంటూ జేసీ ఎస్.ఎస్.శోభికకు వినతిపత్రం అందజేశా రు. జిల్లా వ్యాప్తంగా తొలగించిన 2 వేలు పింఛన్లను పునరుద్ధరించాలని విన్నవించారు. అనంతరం జోగారావు విలేకరులతో మాట్లాడుతూ సమాజంలో అనేక సవాళ్లను అధిగమిస్తూ జీవనపోరాటం సాగిస్తున్న దివ్యాంగులపై కూటమి ప్రభుత్వం కక్షకట్టడంపై మండిపడ్డారు. గతంలో ప్రభుత్వమే నిర్ధారించి వైకల్యం శాతాన్ని గుర్తించి జారీచేసిన సదరం ధ్రువీకరణ పత్రాలు నేడు చెల్లవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తొలగించిన పింఛన్లు పునరుద్ధరించకపోతే పోరాటం ఉద్ధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బోను గౌరీశ్వరి, పార్టీ నాయకులు శ్రీరాముల నాయుడు, సత్యంనాయడు, బొమ్మి రమేష్, మురళీకృష్ణ, జెడ్పీటీసీ అలజంగి రవికుమార్, వైస్ ఎంపీపీలు సిద్ధా జగన్నాథం, రవికుమార్, అనుబంధ విభాగాల నాయకులు మాధవరావు, వెంకటేశ్వరులు, నాగేశ్వరరావు, తిరుపతిరావు, విశ్వనాథం, గౌరీశంకరరావు, షేక్‌సఫీ, వాసుదేవరావు, పీస్‌ఆర్ నాయుడు, మజ్జి శేఖర్, శంకరరావు, మన్మథరావు, గోపాలనాయుడు, సూర్యనారాయణ, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు లావణ్య, నేతాజీ, శ్రీరంజన్, తిరుపతిరావు, వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.