
దగా పడిన దళితులు
● సాగుదారుల భూముల అన్యాక్రాంతం ● 12 ఎకరాల అసైన్డ్ భూమిపై కూటమి నాయకుడి కన్ను ● నకిలీ పాస్ పుస్తకాల తయారీ ● లోబోదిబోమంటున్న అసలు హక్కుదారులు
వారంతా దళితులు. ఆర్థిక పరిస్థితులు బాగాలేక గ్రామంలో వారికి ప్రభుత్వం కేటాయించి అసైన్డ్ భూములను పెద్దలకు లీజుకిచ్చారు. లీజు గడువు ముగిసింది. మా భూములు మాకు అప్పగించండంటూ అసలైన హక్కుదారులు అడుగుతుంటే లీజుకు తీసుకున్న యజమానులు మాత్రం ఈ భూములపై మీకు హక్కు లేదని, పాస్ పుస్తకాలు మా పేరున ఉన్నాయంటూ దబాయించి వారిని తరిమి కొట్టారు.
జియ్యమ్మవలస రూరల్: మండలంలోని చింతల బెలగాం గ్రామానికి చెందిన మండంగి అప్పలస్వామి బెలగాం బలరాం, లక్ష్మయ్య, పారయ్య, చిన్నయ్య, రెడ్డి బుచ్చయ్య, చంద్రయ్య, గరుగుబిల్లి బైరాగి పారయ్య, పండయ్య గుంపయ్య దొనక బోడయ్య, మండంగి చిన్నమ్మి ఇలా 14 మంది దళితులకు 1982లో ప్రభుత్వం అసైన్డ్ చేసిన డీ పట్టాలను సుమారు 12 ఎకరాలకు పైగా అప్పటి ప్రభుత్వం అందజేసింది. అయితే 1994 వరకు ఈ భూమికి సంబంధించి దళిత రైతులు శిస్తు కట్టి సాగు చేసుకున్నారు. అనంతరం వారి ఆర్థిక పరిస్థితులు బాగులేక ఆ భూమిని గ్రామంలోని కొంతమంది రైతులకు లీజుకు ఇచ్చారు. అయితే లీజు సమయం పూర్తి కావడంతో తమ భూమిని తమకు అప్పగించాలని దళితులు కోరగా, మీకు ఎలాంటి హక్కు లేదని లీజుదారులు చెప్పడంతో దళితులంతా అవాక్కయ్యారు. వెంటనే రెవెన్యూ అధికారులను ఆశ్రయిం చారు. ఇప్పటికే పలుమార్లు పాలకొండ రెవెన్యూ డివిజన్ అధికారి దృష్టికి సమస్యను తెలియజేసినప్పటికీ ఫలితం లేకపోయిందని వారంతా వాపోతున్నారు. ప్రస్తుతం 12 ఎకరాల అసైన్డ్ భూమిపై శంభాన శంకర దొర, తెంటు శ్రీనివాసరావు, మర్రాపు పార్వతమ్మ, ఉడుముల శంకరరావు, తిరుపతి నాయుడు, గుంపస్వామి మూడడ్ల సత్యంనాయుడు, దత్తవలస గ్రామానికి చెందిన మండల అప్పలనాయుడు, శంబంగి అప్పలనాయుడు, జయలక్ష్మి, శివున్నాయుడు, వాసుదేవరావులు ఆ భూమిపై నకిలీ పట్టాలను సృష్టించి పాస్ పుస్తకాలను కూడా తయారు చేసుకున్నారని దళితులు ఆరోపిస్తున్నారు.
ప్రధాన సూత్రధారి మాజీ వీర్వో
ఈ భూ ఆక్రమణకు ప్రధాన సూత్రధారి మూడడ్ల సత్యం నాయుడేనని ఆయన గతంలో వీఆర్వోగా పనిచేశారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో వట్టిగెడ్డ ప్రాజెక్ట్ చైర్మన్‌గా ఉన్నారన్నారు. ఆయన అప్పటి రెవెన్యూ అధికారులతో కుమ్మకై ్క పీఓటీ చట్టానికి వ్యతిరేకంగా అసైన్డ్ భూములకు పట్టాలిచ్చి పాస్ పుస్తకాలు తయారు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములు అమ్మడం, కొనడం ఆక్రమణకు పాల్పడడం పీఓటీ చట్టాన్ని అతిక్రమించడమేనన్నారు. తక్షణమే తమ భూమిపై ఉన్న రైతులంతా తమకు భూములను అప్పగించాలని అధికారులకు, కలెక్టర్‌కు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మా భూములు అప్పగించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు ప్రభుత్వం కల్పించిందని వారు హెచ్చరించారు.

దగా పడిన దళితులు