
రైతన్నకు కష్టాలే...
కూటమి
పాలనలో
విజయనగరం గంటస్తంభం: చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా రైతులు ఎరువులు, విత్తనాల కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకుంటుందని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు పీడిక రాజన్నదొర అన్నారు. విజయనగరం ప్రదీప్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఇంటి వద్ద విలేకరులతో శనివారం మాట్లాడారు. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోందన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల వద్ద స్టాక్ ఉంచి రైతులకు అందజేసిన విషయాన్ని గుర్తుచేశారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కూటమి ప్రభుత్వం రైతును వంచించడం సబబు కాదన్నారు. విజయనగరం, సాలూరు నియోజవర్గంలో సుమారుగా 2,500 మంది పింఛన్‌దారులకు నోటీసు అందజేయడం విచారకరమన్నారు. నోటీసులు ఇచ్చామే తప్ప పింఛన్లు తొలగించమంటూ జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పడం సిగ్గుచేటన్నారు. సూపర్ సిక్స్ హామీలను త్రికరణ శుద్ధితో అమలుచేయడంలో సీఎం చంద్రబాబు చేతులెత్తేశారని విమర్శించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 58,58,000 మందికి రైతు భరోసా అందజేస్తే.. నేడు సుమారు 78 లక్షల మంది రైతులు ఉండగా 50 లక్షల మందికే అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి కలిగిందన్నారు. తల్లికి వందనం పథకంలోనూ కోత పెట్టారన్నారు. అధికారంలోకి వచ్చి 16 నెలలవుతున్నా నిరుద్యోగభృతి ఊసేలేదన్నారు. రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఉత్త గ్యాస్‌గా మారిందని విమర్శించారు. ఆడబిడ్డ నిధికి సమాధి కట్టేశారని విమర్శించారు. 18 నుంచి 59 ఏళ్లలోపు వయస్సు మహిళందరికీ ఆడబిడ్డ నిధి కింద ప్రతీనెలా రూ.1500 అందజేస్తామని చెప్పి ఉసూరుమనిపించారన్నారు.
అబద్ధాల పాలన
గిరిజన సంక్షేమ మంత్రి సంధ్యారాణి మాటల్లో నూరుకి తొంభై అబద్ధాలే ఉంటాయని రాజన్నదొర విమర్శించారు. సాలూరు నియోజకవర్గంలోని గిరిశిఖర గ్రామాలకు చంద్రబాబు హయాంలో ఒక్క రోడ్డు కూడా వేయలేదన్నారు. మక్కువ నుంచి మంత్రి స్వగ్రామం కవిరిపలిక్లి, కవిరిపల్లి నుంచి శంబరకు, శంబర నుంచి మామిడిపల్లికి వెళ్లే రోడ్లు అధ్వానంగా మారినా మంత్రి స్పందించకపోవడం విచారకరమన్నారు. మక్కువ నుంచి భోగవలస మెయిన్ రోడ్డును రూ.56 కోట్లతో కొంతమేర పనులు చేసిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిదేనన్నారు. మంత్రికి బురద జల్లడం తప్ప పనులు చేయడం చేతకావడంలేదని విమర్శించారు.
ఇచ్చిన హామీలు అమలెప్పుడు?
ఆడబిడ్డ నిధికి సమాధి
నిరుద్యోగ భృతి ఎక్కడ?
గ్యాస్ సబ్సిడీ నిల్
మంత్రి ఇలాకాలో రహదారులు అధ్వానం
కూటమి సర్కారు వైఫల్యాలపై పీడిక రాజన్నదొర ధ్వజం