
నిందితులను శిక్షించడంలో విజయనగరం టాప్
విజయనగరం క్రైమ్: మహిళలపై దాడులు చేపడుతున్న వారితో పాటు పోక్సో కేసుల్లోని నిందితులను శిక్షించడంలో విజయనగరం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని డీఐజీ గోపీనాథ్ జెట్టీ అన్నారు. శనివారం స్థానిక డీపీఓ అర్ధ సంవత్సరపు నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జిల్లా జడ్జి బబిత హాజరైన ఈ సమీక్షలో డీఐజీ మాట్లాడుతూ..ఎన్‌డీపీఎస్ కేసుల్లో ఎక్కువగా విద్యార్థులు అరెస్ట్ అవుతున్నారన్నారు. గంజాయికి అలవాటు పడిన వ్యక్తులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి, డీ అడిక్షన్ సెంటర్లకు తరలించి చికిత్స అందించాలని సూచించారు. నేరాల నియంత్రణలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. సమాజానికి కీడు కలిగించే ప్రతీ అంశం తెలుసుకోవాల్సిన బాధ్యత పోలీస్ సిబ్బందిపై ఉందన్నారు. సైబర్ కేసులను దర్యాప్తు చేసేందుకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని పోలీస్ అధికారులు మెరుగుపరుచుకోవాలని తెలిపారు. అనుమతుల్లేకుండా కలిగి ఉన్న ఆయుధాలను స్వాధీన పరుచుకునేందుకు కార్డన్‌సెర్చ్ కార్యక్రమాలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలన్నారు.
పరిహారం మంజూరయ్యేలా చర్యలు..
కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మాట్లాడుతూ.. హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులకు పరిహారం తక్షణమే మంజూరయ్యే విధంగా చర్యలు చేపడతామన్నారు. జాతీయ రహదారిపై 66 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు రూ.5 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌కు ఒక డ్రోన్ అందిస్తామన్నారు. అనంతరం ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ.. గంజాయి నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రతి రోజూ పది ప్రాంతాల్లో వాహన తనిఖీలు చేపడుతుండడంతో పాటు ఐదు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి గంజాయి రవాణాను అడ్డుకుంటున్నామని తెలిపారు. 25 పోక్సో కేసుల్లోను, మరో 18 కేసుల్లో నిందితులు శిక్షలు పడేలా చర్యలు తీసుకున్నామన్నారు. అనంతరం శక్తి యాప్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన షార్ట్‌ఫిల్మ్‌ను విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఆవిష్కరించారు. షార్ట్ ఫిల్మ్‌ను రూపొందించిన అగ్గిరాజు, రూప, హారికలను అధికారులు అభినందించారు. అదేవిధంగా గంజాయి కేసుల్లో ఇన్విస్టిగేషన్‌ను సమర్థవంతంగా పూర్తి చేసిన ఎస్.కోట సీఐ వి.నారాయణమూర్తి, బొబ్బిలి రూరల్ సీఐ కె.నారాయణరావులకు డీఐజీ గోపీనాథ్ జెట్టీ ప్రశంసాపత్రాలు అందజేశారు. సమీక్ష సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డిస్ట్రిక్ట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ డి.మణికుమార్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటిండెంట్ బి.శ్రీనాథుడు, డీఎఫ్‌ఓ ఆర్. కొండలరావు, డీఎంహెచ్‌ఓ జీవన్రాణి, డీఈఓ కేవీ రమణ, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ కె.అప్పలరాజు, డీఎస్పీలు ఎం.శ్రీనివాసరావు, జి. భవ్యారెడ్డి, డీఎస్పీ ఎస్.రాఘవులు, డీఎస్పీ ఆర్.గోవిందరావు, డీఎస్పీ ఎం.వీరకుమార్, న్యాయ సలహాదారులు వై.పరశురాం, జైళ్ల శాఖ, ఉమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, డ్రగ్స్ అండ్ కంట్రోల్ శాఖాధికారులు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
డీఐజీ గోపీనాథ్ జెట్టీ
పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాలి..
న్యాయస్థానాల్లో ప్రాసిక్యూషన్ వేగవంతంగా పూర్తయ్యేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాలని జిల్లా జడ్జి బబిత కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను కోరారు. ఎన్డీపీఎన్ కేసుల్లో ఇన్వెంటరీ, సీజర్ చేయడంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. సెప్టెంబర్ 13న నిర్వహించనున్న లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని పోలీస్ అధికారులను కోరారు.