
స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్రపై ప్రతిజ్ఞ
పార్వతీపురం రూరల్: ప్రతీ ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొనేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని డీఆర్‌డీఏ పీడీ ఎం.సుధారాణి అన్నారు. స్వచ్చాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మండలంలోని నర్సిపురం గ్రామంలో స్థానికులతో కలసి శనివారం ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె స్థానికులతో మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉండదని ఆమె తెలిపారు. బాధ్యతగా గ్రామాల్లో ఉన్న చెత్త సేకరణ సిబ్బందికి స్పందిస్తూ నిబంధనల మేరకు తడి చెత్త, పొడి చెత్తలను వేర్వేరుగా అందించి ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా చెత్త సేకరణ సిబ్బందికి అప్పగించాలన్నారు. పార్వతీపురం తహసీల్దార్ సురేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
సైబర్ నేరాల పట్ల తస్మాత్.. : ఎస్పీ
సీతానగరం: సైబర్ నేరాలకు పాల్పడవద్దని, మాదక ద్రవ్యాల బారిన పడి యువకులు తప్పుదోవ పట్టొద్దని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి అన్నారు. మండలంలోని జోగింపేట డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయ క్రీడా మైదానంలో సంకల్పం ఆధ్వర్యంలో సైబర్ నేరాల నివారణ, మాదక ద్రవ్యాల నిర్మూలన అంశంపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాలు, మహిళా రక్షణ చట్టాలు, మాదక ద్రవ్యాల నిరోధం అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు తల్లిదండ్రుల కలలను నిజం చేసే విధంగా విద్యావంతులు కావాలని అన్నారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అదనపు ఎస్పీ అంకిత సురానా, డీవీఈవో నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ రాజారావు, ఎంఈవోలు సూరిదేములు, వెంకటరమణ, సీఐ గోవిందరావు, ఎస్‌ఐ ఎం.రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
వంశధారలో వివాహిత గల్లంతు
భామిని: మండలంలోని లివిరి గ్రామానికి చెందిన వివాహిత కుమ్మరి లక్ష్మి(38) గ్రామ సమీపాన ఉన్న వంశధార నదిలో శనివారం స్నానానికి దిగి గల్లంతైంది. దీన్ని గుర్తించిన నదిలోని తోటి మహిళలు కేకలు వేయడంతో గ్రామస్తులు వచ్చి అధికారులకు సమాచారం ఇచ్చారు. తహసీల్దార్ శివన్నారాయణ, ఎంఆర్‌ఐ మణి ప్రభాకర్, బత్తిలి ఎస్‌ఐ అప్పారావు ఆధ్వర్యంలో కొత్తూరు అగ్నిమాపక సిబ్బంది వచ్చి తెప్పల సాయంతో నదిలో గాలించారు. అయినా లక్ష్మి జాడ కనిపించలేదు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నదీ తీరాన ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ప్లాన్‌లు
విజయనగరం టౌన్: ప్రభుత్వ రంగ సంస్ధ బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ట్రిపుల్ పే ప్లాన్‌ను ప్రకటించిందని ఆ శాఖ డిప్యూటీ జనరల్ మేనేజర్ డి.దాలినాయుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నెలకు రూ. 400 చెల్లించడం ద్వారా హైస్పీడ్ ఇంటర్‌నెట్‌తో పాటూ 400పైగా టీవీ చానెల్స్, తొమ్మిది ఓటీటీ చానెల్స్, అపరిమిత ఫోన్‌కాల్స్ సేవలను పొందవచ్చని పేర్కొన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ ఎఫ్‌టీటీహెచ్ వాడుతున్న వినియోగదారులు కూడా రూ.140 చెల్లించి టీవీ, ఓటీటీ చానల్స్ పొందవచ్చన్నారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్రపై ప్రతిజ్ఞ

స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్రపై ప్రతిజ్ఞ