
‘ఉపాధి’ అవకతవకలపై విచారణ వాయిదా
లక్కవరపుకోట: మండలంలోని కోనమసివానిపాలెం గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని గ్రామానికి చెందిన కాకర శ్రీనివాసరావు గత నెలలో కలెక్టరేట్ గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఉపాధిహామీ పథకం అధికారులు విచారణ చేపట్టడానికి శనివారం గ్రామానికి రాగా.. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడంతో అధికారులు వెనుదిరిగారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఉపాధిహామీ పథకం క్షేత్ర సహాయకుడు బండ అప్పారావు (అప్పన్న) మరో 39 మంది వ్యక్తులతో కలిసి ఉపాధి నిధులను దుర్వినియోగం చేసినట్లు కాకర శ్రీనివాసరావు గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేశారు. 2011 సంవత్సరం నుంచి 2019 వరకు జరిగిన అవకతవకలపై సోషల్ ఆడిట్ బృందాలు సైతం సక్రమంగా ఆడిట్ నిర్వహించలేదని.. అలాగే 2024 వరకు పనికి వెళ్లని వారి పేరిట దొంగ మస్తర్లు వేసి నిధులు దోచుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో గజపతినగరం ఏపీడీ కె.రామామణి ఆధ్వర్యంలో అధికారులు గ్రామంలో గల పంచాయతీ కార్యాలయం వద్దకు శనివారం చేరుకుని విచారణకు సిద్ధపడగా గ్రామస్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. పనులకు సంబంధించి ఎటువంటి అవకతవకలు జరగలేదని ఒకవర్గం.. జరిగాయని మరోవర్గం ఆరోపిస్తూ వాదనకు దిగారు. దీంతో ఓ దశలో తోపులాట జరగడంతో అధికారులు భయంలో సమీపంలో గల రామాలయంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించారు. అయితే పరిస్థితి అనుకూలంగా లేదని పోలీసులు చెప్పడంతో విచారణను వాయిదా వేస్తున్నట్లు ఏపీడీ రమామణి ప్రకటించి, వెళ్లిపోయారు. కార్యక్రమంలో డీబీటీ మేనేజర్ ఆసీఫ్ హుసేన్, స్థానిక ఎపీఓ విజయలక్ష్మి , తదితరులు పాల్గొన్నారు.

‘ఉపాధి’ అవకతవకలపై విచారణ వాయిదా