
త్వరలో అన్ని పోలీస్‌స్టేషన్లకు డ్రోన్లు
విజయనగరం క్రైమ్ : త్వరలో అన్ని పోలీసుస్టేషన్లకు డ్రోన్లు పంపిణీ చేస్తామని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. నేరాల నియంత్రణలో సాంకేతికతను విరివిగా ఉపయోగించాలని అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా విజయనగరం టూటౌన్ పోలీసుస్టేషన్‌ను శనివారం సందర్శించారు. స్టేషన్ ప్రాంగణాన్ని పరిశీలించారు. స్టేషన్లోని సీసీ టీవీ కమాండ్ కంట్రోల్ రూమును సందర్శించి వాటి పని తీరును చూశారు. స్టేషన్లో పని చేస్తున్న కోర్ట్ కానిస్టేబుళ్లతో మాట్లాడి శిక్షలు పడటానికి అనుసరించాల్సిన పద్ధతుల గురించి వివరించారు. సాక్షులను సకాలంలో కోర్టులో హాజరు పర్చాలని, సమన్లు సకాలంలో సర్వ్ చేయాలని సూచించారు. అనంతరం స్టేషన్లోని రిసెప్షన్, గదులను పరిశీలించి, రికార్డులు, సీడీ ఫైల్స్ తనిఖీ చేసి, పోలీసుస్టేషన్ పరిధిలో శాంతిభద్రతలపై సమీక్షించారు. నేరాల నియంత్రణలో సాంకేతికతను విస్తృతంగా వినియోగించి అదుపు చేయాలన్నారు. సైబర్ నేరాలను నియంత్రించేందుకు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలన్నారు. సైబర్ నేరాల దర్యాప్తులో సాంకేతికతను వినియోగించుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. అనంతరం మహిళా సంరక్షణ పోలీసులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళా సంరక్షణలో పోలీసుల పాత్ర చాలా కీలకం అని, వారు శక్తి యాప్ గురించి క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, గంజాయి సమాచారిన్ని సేకరించి సంబంధిత అధికారులకు చేరవేయాలని ఎం.ఎన్.పి.లను డీఐజీ ఆదేశించారు. అనంతరం సీఐ చాంబర్‌లో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో గంజాయి నిర్మూలనకు ప్రత్యేక దృష్టి సారించినట్టు చెప్పారు. ఇక ఎంఎస్పీలను బందోబస్తుకు ఉపయోగించబోమని, కేవలం స్టేషన్ వారీగా సమాచారం కొరకు వారి సేవలను వినియోగిస్తున్నామన్నారు. అనంతరం డీఐజీ జెట్టి, ఎస్పీ వకుల్ జిందల్ పోలీసుస్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. వార్షిక తనిఖీల్లో డీఐజీతో పాటు డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, ఎస్పీ సీఐ ఎ.వి.లీలారావు, టూటౌన్ సీఐ టి.శ్రీనివాసరావు,ఎస్‌ఐలు కృష్ణమూర్తి, కనకరాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.