
అనుమానాస్పదంగా మహిళ మృతి
రామభద్రపురం: మండలంలోని తారాపురంలో ఓ మహిళ అనుమానస్పద స్థితిలో గురువారం మృతిచెందింది. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తారాపురం గ్రామానికి చెందిన తుమరాడ శ్యామల(41)కు 20 ఏళ్ల క్రితం ఇదే మండలం జన్నివలస గ్రామానికి చెందిన పత్తిగుళ్ల అప్పలనాయుడుతో వివాహం జరిగింది. అయితే భార్యాభర్తల మధ్య కొద్దిపాటి మనస్పర్థలతో వివాహం జరిగిన రెండేళ్లకే విడాకులు తీసుకుని విడిపోయారు. దీంతో శ్యామల గడిచిన 18 ఏళ్ల నుంచి కన్నవారి ఊరు తారాపురంలో వారు ఇచ్చిన పూరింట్లో ఒంటరిగా నివాసం ఉంటూ కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఇంతలో అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. వారిద్దరి మధ్య ఏం జరిగిందో గాని గురువారం తెల్లారేసరికి పురుగు మందు తాగి చనిపోయి ఉంది. పురుగు మందు డబ్బా కూడా మృతదేహం పక్కనే ఉంది. కుటుంబ సభ్యులు పురుగు మందు డబ్బా మురుగు కాల్వలో పారేసి మృతదేహాన్ని దహనం చేసేందుకు శ్మశానానికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.అయితే మృతురాలి అన్నయ్య తుమరాడ సింహాచలం తన చెల్లిది మృతికి కారణం ఆత్మహత్య కాదని, అనుమానాస్పదంగా ఉందని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఏఎస్సై అప్పారావు సిబ్బందితో కలిసి తారాపురంలోని ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. విజయనగరం నుంచి క్లూస్‌టీమ్‌ను రప్పించి వేలిముద్రలు సేకరించారు. అలాగే శ్యామల మృతికి గల కారణాలను గ్రామంలోని చుట్టుపక్కల నివాసాల ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. మృతురాలి అన్నయ్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.