
దేవుడి భూములతో రియల్‌ఎస్టేట్ వ్యాపారమా?
సాలూరు: పట్టణంలో అన్యాక్రాంతమవుతున్న పలు దేవాదాయ ధర్మాధాయశాఖ భూములను పరిరక్షించాలని సామాజిక కార్యకర్త నైన హరిరెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం పట్టణంలో ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు.పట్టణంలోని వేంకటేశ్వరస్వామి ఆలయ నూతన కమిటీ సభ్యుల ప్రమాణస్వీకారం గతంలో ఎన్నడూ లేని విధంగా అట్టహాసంగా జరిగిందని, మంత్రి సంధ్యారాణి ఈ కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారని పేర్కొన్నారు. అయితే ప్రమాణ స్వీకారం చేసిన కమిటీలో సభ్యుడైన పేర్ల విశ్వేశ్వరరావుపై సీఎంకు, ఇతర ఉన్నతాదికారులకు తాను ఫిర్యాదు చే సినట్లు తెలిపారు. ఆయన రియల్‌ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఎక్కువగా దేవదాయధర్మాదాయ శాఖ భూములనే కొనుగోలు చేశారని ఆరోపించారు. అందులో ముఖ్యంగా పట్టణంలో వేణుగోపాలస్వామి, సీతారామస్వామి, ఆంజనేయ స్వామి ఆలయాలకు చెందిన విలువైన భూములను తక్కువ ధరలకు కొనుగోలుచేశారని పేర్కొన్నారు. దేవుని భూములను మోసపూరితంగా దక్కించుకున్న వ్యక్తిని వేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ సభ్యుడుగా ఎలా నియమించారని, ఆయన పేరును ఎవరు సిఫారసు చేశారని, అటువంటి వ్యక్తితో మంత్రి ఎలా ప్రమాణస్వీకారం చేయించారని పలు ప్రశ్నలు వేశారు. కమిటీలో ఒక్క బ్రాహ్మణుడు, ఎస్టీ లేరంటూ ఎండోమెంట్ ఈఓ తీరును తప్పుబట్టారు. అధికారులు స్పందించి ఇటువంటి వారిపై తనిఖీలు చేసి, కోట్ల రుపాయల విలువైన దేవాదాయధర్మాదాయ శాఖ భూములను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
వేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ
సభ్యుడిపై సీఎంకు ఫిర్యాదు
సామాజిక కార్యకర్త నైన హరిరెడ్డి