
చీటింగ్ కేసు నమోదు
పార్వతీపురం రూరల్: పట్టణంలో 2017వ సంవత్సరంలో ఒక వ్యాపారి వద్ద ఫిర్యాదు దారులు బంగారం తాకట్టు పెట్టగా సదరు వ్యాపారి మృతిచెందడంతో వ్యాపారి కుమారుడు మాటమార్చేశాడు. తమ వద్ద బంగారం తాకట్టు పెట్టలేదని వాగ్వాదం చేయడంతో ఇటీవల ఎస్పీకి బాధితులు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు మంగళవారం చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై గోవింద తెలిపారు.
హెచ్చరిస్తున్న వినిపించుకోరా?
భారీ వర్షాల సూచనతో జాగ్రత్తలు పాటించాలని..అలాగే ఇప్పటికే నిండిన చెరువులు, ప్రవహిస్తున్న గెడ్డల్లో దిగి స్నానాలు, ఈత వంటివి కొట్టకూడదని చెబుతున్నా యువత పట్టించుకోకపోవడం సరికాదని రూరల్ ఎస్సై బి.సంతోషి అన్నారు. భారీ వర్ష సూచన మేరకు మంగళవారం మండలంలోని పలు ప్రాంతాల్లో పరిశీలించిన ఆమె బందలుప్పి ఊర చెరువులో ప్రమాదకరంగా ఈతకొడుతున్న యువతను పిలిచి మందలించి హెచ్చరికలను విస్మరించడం సరికాదన్నారు. బాధ్యతగా ఉంటూ జాగ్రత్తలు పాటించి తీరాలని యువకులకు అవగాహన కల్పించారు.