వీరఘట్టం: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి గేదెల తుహిన్‌కుమార్‌ను శ్రీకాకుళం జిల్లా బార్ అసోషియేషన్ న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. ఆదివారం ఆయన స్వగ్రామం వీరఘట్టం మండలం కత్తులకవిటిలో కలిసి అభినందనలు తెలిపారు. స్వయంకృషితో ఇంతటి ఉన్నత స్థానానికి ఎదిగిన తుహిన్‌కుమార్ మన ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం ఎంతో గర్వకారణంగా ఉందని వీరన్నారు. జడ్జిని కలిసిన వారిలో శ్రీకాకుళం బార్ అసోషియేషన్ న్యాయవాదులు వాన కృష్ణచంద్, ఎన్ని సూర్యారావు, కొమరాపు ఆఫీసునాయుడు, మామిడి క్రాంతి తదితరులున్నారు. స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ హైకోర్టు న్యాయమూర్తిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.
నేడు పీజీఆర్‌ఎస్
సీతంపేట: స్థానిక ఐటీడీఏలో సోమవారం పీజీఆర్‌ఎస్ నిర్వహించనున్నారు. ఏపీవో చిన్నబాబు వినతులు స్వీకరించనున్నారు. గిరిజనులు తమ సమస్యలపై వినతులు సమర్పించవచ్చని ఐటీడీఏ అధికార వర్గాలు తెలిపాయి.
కూటమి పాలనలో మహిళా ఉద్యోగులకు వేధింపులు
నెల్లిమర్ల రూరల్: కూటమి ప్రభుత్వంలో మహిళా ఉద్యోగులకు వేధింపులు ఎక్కువయ్యాయని జై భీమ్‌రావ్ భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు టొంపల నరసయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కనిగిరి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. మండలంలోని గుషిణి గ్రామంలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీల నాయకులు, అనుచరుల వేధింపులు రాష్ట్రంలో ఏదో ఒక చోట నిత్యకృత్యమయ్యాయని ఆరోపించారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో గర్భిణి శ్రావణి ఆత్మహత్యే అందుకు ఉదాహరణ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ రాత్రి 10 గంటల తరువాత మహిళ ఉద్యోగులను పార్టీ కార్యాలయానికి రప్పించడమేమిటని ప్రశ్నించారు. రాత్రి 10.30 దాటిన తరువాత వీడియో కాల్స్ చేసి వేధించడం దుర్మార్గమైన చర్య అన్నారు. పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్యపై కక్ష సాధింపు చర్యలకు దిగి అన్యాయంగా బదిలీ చేయించారన్నారు. ఎమ్మెల్యేకు అనుకూలంగా ఉన్న సొంత సామాజిక వర్గానికి చెందిన ఎస్‌ఎస్‌ఏ అధికారి శశిభూషణ్ నుంచి తప్పుడు నివేదికలు తెప్పించి దళిత ఉద్యోగి సౌమ్యకు అన్యాయం చేశారని ఆరోపించారు. శశిభూషణ్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ పార్లమెంట్ ఇన్‌చార్జ్ చిన్నం అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.