
వాన గండం
తోటపల్లికి నీటిపోటు
సాక్షి, పార్వతీపురం మన్యం: అల్పపీడన ప్రభావంతో జిల్లాలో ఈ నెల 19వ తేదీ వరకు ఉరుములతోపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షం కురుస్తోంది. ఈ నెల 14న 19.0 మి.మీ, 15న 10.4, 16న 18.4 మి.మీ చొప్పున సగటు వర్షపాతం నమోదైంది. శనివారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 8.6 మి.మీ. వర్షం కురిసింది. అత్యధికంగా భామినిలో 24.4, గుమ్మలక్ష్మీపురం 33.6, జియ్యమ్మవలస 27.6, వీరఘట్టం 17.4 మి.మీ చొప్పున నమోదైంది. జిల్లాతో పాటు, ఎగువన అడపాదడపా కురుస్తున్న వానలతో నదులు, ప్రాజెక్టులు నిండుతున్నాయి. చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి.
యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన కలెక్టర్
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి, పంట నష్టాలు వాటిల్లరాదని, దీనికోసం ముందుగా గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేయాలని స్పష్టం చేశారు. సంబంధిత అధికారులతో శనివారం వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రధానంగా 17, 18వ తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున లోతట్టు, నదీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు స్నానాలు చేయడం, దుస్తులు శుభ్రం చేయడం, పశువులను కడగడం, ఇసుకను తవ్వడం వంటి పనులు చేపట్టరాదని తెలిపారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. పంట కాలువలు, గట్లు తెగిపోకుండా ఇసుక బస్తాలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో నదులు, వాగులు, వంకలు, చెరువులను ఎవరూ దిగకుండా సూచనలు చేయాలని తెలిపారు. శిథిలావస్థలోని భవనాలు, పాఠశాలల్లో ఎవరూ లేకుండా చూసుకోవాలన్నారు. విద్యుత్ స్తంభాల పట్ల ఆ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటూ, నిత్యం అందుబాటులో ఆదేశించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య ఆరోగ్యం పట్ల ఆయా శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.
నేడు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం
నిండుతున్న నదులు, చెరువులు
ప్రజలను అప్రమత్తం చేయాలి : కలెక్టర్
గరుగుబిల్లి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు తోటపల్లి ప్రాజెక్టుకు నీటిప్రవాహం పెరిగింది. నాగావళినదిలో తోటపల్లి ప్రాజెక్టు వద్ద శనివారం సాయంత్రం నాటికి 105 మీటర్ల లెవిల్‌కు గాను 104.2 మీటర్ల లెవిల్‌లో నీరు నిల్వఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 6,448ల క్యూసెక్కుల నీరు చేరుతుండగా అధికారులు రెండు గేట్లును ఎత్తివేసి 6,853 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడిచిపెడుతున్నారు. కాలువలకు మరో 1,300 క్యూసెక్కుల నీరు విడిచిపెట్టారు. ప్రాజెక్టు నీటిసామర్థ్యం 2.53 టీఎంసీలకు 2.08 టీఎంసీలు నీరు నిల్వ ఉంది ప్రాజెక్టు వద్ద నీటి పరిస్థితిని ఏఈ కిశోర్ పర్యవేక్షిస్తున్నారు.