
హామీల జోరు.. అమలులో బేజారు
సాలూరు: కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నుంచి మంత్రులు, నాయకులు హామీలు ఇవ్వడంలో జోరుగా, హుషారుగా ఉంటారని, వాటిని అమలు చేయకుండా ప్రజలను బేజారు పెడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఏపీఏ సభ్యులు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర విమర్శించారు. సాలూరు పట్టణంలోని తన స్వగృహంలో శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
● జీఓ 3ను పునరుద్ధరిస్తామని, గిరిజన గ్రామాలను షెడ్యూల్ గ్రామాలుగా మార్చుతామని, ఆదివాసీలకు స్పెషల్ డీఎస్సీ, 5వ షెడ్యూల్డ్, 1/70 కచ్చితంగా అమలు చేస్తామని, కొఠియా గ్రామాలకు పరిష్కారం చూపుతామని, కుడుమూరు భూ వివాదం పరిష్కారం, డోలీ కష్టాలు లేకుండా చూస్తామని చంద్రబాబునాయుడు, లోకేష్, సంధ్యారాణి ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇప్పటివరకు వాటి పరిష్కారం ఊసేలేదు. దీనిపై గిరిజనులు ప్రశ్నిస్తున్నా స్పందన లేదు. ఇది గిరిజనులను మోసం చేయడం కాదా?. అబద్ధాలతో ఎన్నాళ్లు పాలిస్తారని రాజన్నదొర నిలదీశారు.
అబద్ధాలు చెప్పడంతో ఆరితేరిన మంత్రి...
మంత్రి సంధ్యారాణి ప్రజాదర్బార్, పత్రికా సమావేశాలు, స్వాతంత్య్రదినోత్సవ వేదిక, చివరికి చట్టసభలలోనైనా అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. సాలూరు శ్యామలాంబ పండగ కోసం రూ.2 కోట్ల అప్పుడబ్బులతో చేపట్టాల్సిన పనులకు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపినప్పటికీ, కౌన్సిల్ ఆమోదం తెలపలేదని ప్రజలు, పత్రికాసమావేశాల్లో మంత్రి సంధ్యారాణి అబద్ధాలు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. మహిళల ఆత్మగౌరవం కోసం సాలూరులో మరుగుదొడ్ల మరమ్మతులకు రూ.20లక్షల నుంచి రూ.30లక్షల వరకు నిధులు తీసుకువస్తానని చెప్పిన మంత్రి ఏడాది గడిచినా పట్టించుకోలేదని, ఆ పనులు ఇప్పటికీ జరగలేదని, మహిళల ఆత్మగౌరవ నినాదం ఏమైందని రాజన్నదొర ప్రశ్నించారు. ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎంల నియామకంపై మంత్రి పెట్టిన తొలి సంతకం నేటికీ కార్యరూపం దాల్చలేదని ఎద్దేవా చేశారు.
● 2014–19 మద్య టీడీపీ హయాంలో సంధ్యారాణి ఎమ్మెల్సీగా ఉండగా తను ఎమ్మెల్యేగా ఉన్నానని, 2015లో నాటి కలెక్టర్ ఎం.ఎం.నాయక్ సాలూరు నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి పనులకు ఉపాధిహామీ కింద సుమారు 100 కోట్ల రూపాయలు మంజూరు చేశారన్నారు. తరువాత కలెక్టర్‌గా వచ్చిన వివేక్‌యాదవ్ తాగునీరు, రోడ్డ పనుల కోసం రూ.4.50 కోట్లు మంజూరు చేస్తే ఎమ్మెల్సీగా ఉన్న సంధ్యారాణి ఆ నిధులు రాకుండా అడ్డుకున్నారని రాజన్నదొర విమర్శించారు.
● సాలూరులో వందపడకల ఆస్పత్రిని 2018లో మంజూరు చేశారని సంధ్యారాణి చెబుతున్నారని, అప్పట్లో ఎందుకు నిర్మాణం ప్రారంభించలేదని రాజన్నదొర ప్రశ్నించారు. నిర్మిస్తామంటే తాము ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదన్నారు. 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన ఆస్పత్రికి అన్నిరకాల అనుమతులు తీసుకొచ్చి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆస్పత్రి మిగులు పనులను మూడు నెలల్లో పూర్తిచేయిస్తామని మంత్రి హామీ ఇచ్చి మరచిపోయారన్నారు. అబద్ధాలు చెబుతున్నారనేందుకు ఇదో ఉదాహరణగా పేర్కొన్నారు.
● సంధ్యారాణి సొంత ఊరు కవిరిపల్లికి రోడ్డు వేసిన ఘనత గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిదేనన్నారు. ఇప్పుడు అదే రోడ్డుపై ప్రయాణిస్తున్న విషయాన్ని మంత్రి మర్చిపోరాదన్నారు. 2006లో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి 2024 వరకు మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్టు రాజన్నదొర వివరించారు. సాలూరు–కొట్టక్కి బ్రిడ్జి, రూ.42కోట్లతో సాలూరు బైపాస్ నిర్మాణం, రూ.50లక్షలతో సాలూరు తహసీల్దార్ కార్యాలయ భవనం, రూ.420 లక్షలతో వైటీసీ బిల్డింగ్స్, పట్టణంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలకు అదనపు గదులు, కాకులతోట నుంచి పాంచాలికి బ్రిడ్జి, పలు మున్సిపల్ పాఠశాలలకు అదనపు గదులు, సబ్ ట్రెజరీ కార్యాలయం ఆధునీకరణ, వ్యవసాయ ఎ.డి.కార్యాలయం, ఏటీడబ్ల్యూఓ కార్యాలయం, సీడ్ కార్పొరేషన్ గోదాం, అవసరం ఉన్న ప్రతివార్డుల్లో పైలెట్ వాటర్‌స్కీం, సీసీ రోడ్లు, కాలువలు, నిర్మాణంలో ఉన్న అర్బన్ ఆరోగ్య కేంద్రం, నూతన ప్రసూతి నిరీక్షణ కేంద్రం, అత్యవసర మాతా శిశు సంరక్షణ కేంద్ర భవనం, నిర్మాణంలో ఉన్న వందపడకల ఆస్పత్రి తదితర అనేక అభివృద్ది పనులు చేపట్టామని పేర్కొన్నారు.
● నేడు మంత్రిగా ఉన్న సంధ్యారాణి, గతంలో కాంగ్రెస్ పార్టీలో మహిళా శిశుసంక్షేమశాఖ రీజనల్ డైరెక్టర్, ఏపీ ఎస్టీ కమిషన్ సభ్యురాలు, తరువాత టీడీపీలో ఎమ్మెల్సీగా పదవులు చేపట్టి సాలూరు నియోజకవర్గానికి ఎన్ని అభివృద్ధి పనులు చేశారో చెప్పాలని రాజన్నదొర డిమాండ్ చేశారు. జీతం తీసుకుని ప్రజలకు సేవ చేయకపోవడమంటే ప్రజలకు అన్యాయం చేసినట్లు కాదా అని ప్రశ్నించారు. మాటలు ఆడడం, అబద్ధపు హామీలు ఇవ్వడం సులభమని, మాటకు కట్టుబడడం, ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో నెరవేర్చేవారే నిజమైన పాలకులని గుర్తుచేశారు. వారికి ప్రజాదరణ ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఆయన వెంట పలువురు నాయ కులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
టీడీపీది అబద్ధాల పాలన
ఏడాదిన్నరగా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు
కనిపించని అభివృద్ధి, సంక్షేమం
పథకాల అమలులో కనిపించని చిత్తశుద్ధి
మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర