కమ్యూనిటీ పోలీసింగ్‌తో యువత సన్మార్గం
● ఎస్‌పీ మాధవరెడ్డి
సీతంపేట: యువతను సన్మార్గంలో నడిపించడానికి కమ్యూనిటీ పోలీసింగ్ దోహదపడుతుందని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం సీతంపేట మండలంలోని దోనుబాయి పోలీస్‌స్టేషన్ ఆవరణలో జరిగిన వాలీబాల్ టోర్న్‌మెంట్ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై ఫైనల్ గేమ్‌ను ప్రారంభించారు. అనంతరం విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఏజెన్సీ మారుమూల గ్రామాల్లో క్రీడా పోటీలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సీతంపేట, సీతానగరం, దోనుబాయి పరిధిలో పలు గ్రామాల్లో ఇప్పటికే మెడికల్ క్యాంపులు కూడా ఘనంగా నిర్వహించామన్నారు. ప్రజలతో పోలీసులకు సత్సంబంధాలు నెలకొల్పడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. సైబర్‌నేరాలు, మత్తుపదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తామని, దాని ద్వారా మీ ప్రాంతంలో గంజాయి ఇతర మత్తు పదార్థాలు ఉంటే సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ ప్రాంతంలో సారా వంటకాలు జరుగుతున్నాయనే సమాచారం ఉందని, సారా వండడం, విక్రయించడం నేరమని స్పష్టం చేశారు.
వాలీబాల్ విజేత దుగ్గి..
దోనుబాయి పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన వాలీబాల్ పోటీల్లో దుగ్గి జట్టు మొదటి స్థానంలో నిలిచింది. రెండోస్థానంలో పొల్లకాలనీ, మూడో స్థానంలో పెద్దపల్లంకి జట్టు నిలిచాయి. నగదు బహుమతులు వరుసగా రూ.5వేలు, రూ.3వేలు, రూ.2 వేలు, షీల్డులు, క్రీడాదుస్తులు, నెట్, బాల్‌ను ఎస్‌పీ మాధవరెడ్డి విజేతలకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బి.ఆదినారాయణ, పాలకొండ సీఐ మీసాల చంద్రమౌళి, దోనుబాయి, సీతంపేట, బత్తిలి,వీరఘట్టం ఎస్సైలు మస్తాన్, వై.అమ్మన్నరావు, అనిల్‌కుమార్, కళాధర్, పీహెచ్‌సీ వైద్యాధికారి భానుప్రతాప్, దోనుబాయి ఆశ్రమపాఠశాల పీడీ ఆర్‌సీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


