19నెలల పాలనలో.. రూ.2.93 లక్షల కోట్లు అప్పు
● కొత్త పింఛన్లు ఇవ్వడం లేదు ● లక్షలాది పెన్షన్ల తొలగింపు ● ఆరోగ్యశ్రీ(ఎన్టీఆర్ వైద్యసేవ)కి తూట్లు ● సీఎం చంద్రబాబు ఘనత ఇదే.. ● మాజీ డిప్యూటీసీఎం పీడిక రాజన్నదొర
సాలూరు రూరల్: చంద్రబాబునాయుడు 19 నెలల పాలనలో రూ.2లక్షల 93 వేల కోట్లు అప్పు తప్ప అభివృద్ధి కనిపించడంలేదని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర విమర్శించారు. సాలూరులో స్థానిక విలేకరులతో ఆయన బుధవారం మాట్లాడారు. మంచి ప్రభుత్వమని గొప్పలు చెప్పుకోవడం మానుకొని ప్రజలనోట మంచి ప్రభుత్వం అని పలికించుకునేలా పాలన సాగించాలని హితవుపలికారు. అధికారుల లెక్కల ప్రకారం గత ప్రభుత్వం సుమారు 66 లక్షల పెన్షన్లు ఇచ్చిందని, ప్రస్తుతం 62 లక్షల మందికే పెన్షన్లు ఇస్తున్నారన్నారు. పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతేనే భార్యకు పింఛన్ ఇస్తున్నారే తప్ప కొత్త పింఛన్లు ఇవ్వకపోవడం విచారకరమన్నారు. భర్త చనిపోయి పుట్టెడు కష్టాల్లో ఉన్న వితంతువులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్యానికి లేకపోవడం విచారకరమన్నారు. ఎన్నికల సమయంలో 50 ఏళ్లకు పింఛన్ ఇస్తామని చెప్పి 60 ఏళ్లు పైబడిన వారికి కూడా పింఛన్ మంజూరు చేయకపోవడం సమంజసం కాదన్నారు. 2025 సంవత్సరంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారని, విద్యుత్ చార్జీలు పెంచడం, రైతుకు యూరియా లభించకపోవడం, ఆరోగ్యశ్రీ సేవలు అందకపోవడంతో పాటు ఆడబిడ్డ నిధి, నిరుద్యోగభృతి అమలుకునోచుకోలేదని, కనీసం 2026 సంవత్సరంలోనైనా ప్రజలకు సంక్షేమాన్ని అందించాలని సీఎం, డిప్యూటీ సీఎంలను కోరారు.
సీతంపేట: ఐటీడీఏ డిప్యూటీ ఈవోగా మల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాల హెచ్‌ఎం పాలక నారాయుడుకు ఎఫ్‌ఏసీ బాధ్యతలు అప్పగిస్తూ పాలకొండ సబ్‌కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ పవార్ స్వప్నిల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పనిచేసిన డిప్యూటీ ఈఓ రామ్మోహన్‌రావు ఉద్యోగవిరమణ చేయడంతో ఆ స్థానంలో నారాయుడు త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు.


