ఆలయంలో చోరీ కేసు ఛేదన
● ఇద్దరు నిందితుల అరెస్ట్
● రూ.9.40 లక్షల విలువైన బంగారు,
వెండి ఆభరణాలు స్వాధీనం
పార్వతీపురం రూరల్: సీతానగరం మండలం లచ్చయ్యపేట ఎన్‌సీఎస్ చక్కెర కర్మాగారం ఆవరణలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన భారీ చోరీ మిస్టరీని సీతానగరం పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో ప్రమేయమున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి సుమారు రూ. 9.40 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలో గల ఏఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్వతీపురం ఏఎస్పీ మనీషా రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. సీతానగరం మండలం జోగింపేటకు చెందిన పోలా భాస్కరరావు, హిరమండలానికి చెందిన సవర సూర్యం వృత్తిరీత్యా దొంగలు. గతంలో వారిద్దరూ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సమయంలో ఒకరికొకరు పరిచయమై, బయటకు వెళ్లాక పెద్ద మొత్తంలో సొత్తును అపహరించాలని పథకం రచించారు. కటకటాల నుంచి విడుదలైన తర్వాత తమ పాత బుద్ధిని పోనిచ్చుకోకుండా, నవంబరు 1వ తేదీ రాత్రి లచ్చయ్యపేట ఆలయంలో చొరబడి నగలను దోచుకెళ్లారు. అయితే, తీగ లాగితే డొంక కదిలినట్లు డిసెంబరు 7న బొబ్బిలి పోలీసులు వేరే కేసులో వీరిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా లచ్చయ్యపేట చోరీ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నిందితుల అంగీకార నివేదిక ఆధారంగా సీతానగరం పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకున్నారు. జోగింపేట గ్రామ శివారులో నిందితులు దాచి ఉంచిన సుమారు 92 గ్రాముల బంగారు ఆభరణాలు, 5 కేజీల 400 గ్రాముల వెండి వస్తువులను పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.10.75 లక్షల విలువైన సొత్తు అపహరణకు గురవగా, రూ.9.40 లక్షల విలువైన వస్తువులను రికవరీ చేశారు. చాకచక్యంగా దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్న పార్వతీపురం రూరల్ సీఐ రంగనాథం, ఎస్సై ఎం.రాజేష్ పోలీసు సిబ్బందిని ఏఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
ఆలయంలో చోరీ కేసు ఛేదన


