దళితులు, గిరిజనులపై దాడులు తగవు
పాచిపెంట: దళితులు, గిరిజనులపై టీడీపీ నాయకులు దాడులకు తెగబడడం తగదని మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర అన్నారు. పాచిపెంట మండలం మోసూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన సోమ వారం ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో నిర్మించిన సామాజిక భవనాన్ని ప్రారంభించారు. మాజీ వైస్ ఎంపీపీ గండిపిల్లి రాము అధ్యక్షతన నిర్వహించిన సభలో రాజన్నదొర మాట్లాడుతూ నియోజకవర్గంలో మంత్రి సంధ్యారాణి రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని విమర్శించారు. దళితులు, గిరిజనులే లక్ష్యంగా దాడులు చేయిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. అనేక మంది చిరుద్యోగులను తొలగించడం, దళిత అధికారులను బదిలీ పేరుతో వేధించడం తగదన్నారు. పాచిపెంట మండలంలో 8 మంది, మెంటాడలో 8 మంది చిరుద్యోగులను సస్పెండ్ చేయించారని చెప్పారు. రాజ్యాంగంలో పంచాయతీ సర్పంచ్‌లకు కల్పించిన హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీనిపై ప్రజలతో పాటు స్థానిక పాలకులు పోరాటం సాగించాలన్నారు. దాడులకు పాల్పడేవారిపై ఫిర్యాదులు చేసి రశీదు తీసుకోవాలన్నారు. పాచిపెంట మండలంలో దళిత నాయకుడు గండి పిల్లి రాము 24 ఏళ్లుగా సాగుచేస్తున్న భూములను ఇప్పుడు సర్వే చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. అదే గ్రామంలో టీడీపీ నాయకుడు చెరువుని దర్జాగా కబ్జా చేస్తే ఎందుకు స్పందించడం లేదన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి డోల బాబ్జి మాట్లాడుతూ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా దళితులు, గిరిజనులపై దాడులు జరుగుతున్నాయన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్ వల్లనే మంత్రి అయిన విషయాన్ని సంధ్యారాణి మరచిపోయారని, అదే వర్గ ప్రజలపై దాడులను అరికట్టడంలో విఫలమయ్యారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు దండి శ్రీనివాసరావు, ఎంపీపీ ప్రతినిధి పాచిపెంట వీరంనాయుడు, వైస్ ఎంపీపీ రవీంద్ర, పార్టీ మండలాధ్యక్షుడు గొట్టాపు ముత్యాలనాయుడు, మాజీ వైస్ ఎంపీపీ తట్టికాయల గౌరీష్, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.


