Vizianagaram: భార్యభర్తలకు ఎన్ని పదవులిచ్చినా అదేతీరు... | Sakshi
Sakshi News home page

Vizianagaram: భార్యభర్తలకు ఎన్ని పదవులిచ్చినా అదేతీరు...

Published Tue, Mar 5 2024 1:20 AM

- - Sakshi

 మరోసారి పార్టీ మార్చిన ఎమ్మెల్సీ రఘురాజు 

భార్యను, అనుయాయులను టీడీపీలోకి పంపిన వైనం 

స్థాయికి మించి పదవులిచ్చిన వైఎస్సార్‌సీపీకి నమ్మకద్రోహం 

భార్యాభర్తల గూడుపుఠాణి రాజకీయంతో టీడీపీలోనూ షాక్‌ 

 తమనెత్తిన కుంపటి పెట్టొద్దని ‘కోళ్ల’పై కస్సుబుస్సు

సాక్షి ప్రతినిధి, విజయనగరం: చ్చిన మాట కోసం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి పెద్దలసభలో గౌరవంగా కూర్చోబెట్టారు... శృంగవరపుకోట ఎంపీపీ పదవి ఎస్సీలకు రిజర్వు అయినా వైస్‌ ఎంపీపీ పదవిని అతని భార్యకు ఇచ్చి వైఎస్సార్‌సీపీ శ్రేణు లు గౌరవం ఇచ్చాయి. కానీ ఆ దంపతుల తీరు మా త్రం మారలేదు. అధికారలాలన, పదవీ వ్యామో హం, ఆధిపత్యధోరణి వారిని అడ్డదారులు తొక్కేలా చేశాయి. పదవులిచ్చిన పార్టీకి నమ్మకద్రోహం చేయడానికి ఏమాత్రం వెనుకాడలేదు. ఇలాంటి పెత్తందారీ మనస్తత్వం ఉన్న ఎమ్మెల్సీ రఘురాజు భార్య సుబ్బలక్ష్మి అలియాస్‌ సుధారాజుని పెత్తందారుల పార్టీ టీడీపీ అక్కున చేర్చుకుంది.

ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఒకవైపు, గొంప కృష్ణ మరోవైపు ఉంటూ ఆజ్యం పోస్తున్న గ్రూపుల గోల మధ్య మరో కుంపటిని తీసుకొచ్చి నెత్తిన పెట్టారంటూ టీడీపీ శ్రేణులు లోలోన రగిలిపోతున్నారు. నిత్య అసమ్మతివాదిగా, శృంగవరపుకోట నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చేసే రాజు కుటుంబం వద్దంటూ గగ్గోలు పెడుతున్నారు. వారిని ఎలా పార్టీలోకి ఆహ్వానించారంటూ మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారిపై కస్సుబుస్సుమంటున్నారు.

స్థాయికి మించి ఆధిపత్యం కోసం...
వాస్తవానికి నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా, పార్టీ కార్యక్రమాలు చేయాలన్నా ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు తొలి నుంచి రఘురాజు కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ, అధికార పరిధిని మించి నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం రఘురాజు దంపతులు నిత్యం ఏదో ఒక అగ్గి రాజేస్తూనే వచ్చారు. వారి అనుయాయులతో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేయించారు. అసంబద్ధమైన ఆరోపణలతో ఆకాశరామన్న ఉత్తరాలు రాయించారనే విమర్శలు వారిపై వచ్చాయి. పార్టీలో గ్రూపు రాజకీయాలు సరికాదని పెద్దలు నచ్చజెప్పినా రాజు కుటుంబం వెనక్కు తగ్గలేదు. చివరకు కడుబండి వద్దంటూ డిమాండులు పెట్టారు. ఇది సరికాదని, మరోసారి పక్కాగా గెలిచేచోట అభ్యర్థి మార్పు ఉండదని పార్టీ అధిష్టానం రఘురాజుకు తేల్చి చెప్పింది.

కానీ ఆ దంపతుల వైఖరిలో మార్పు రాలేదు. గత ఆర్నెళ్లుగా ఇద్దరూ పనిగట్టుకుని నియోజకవర్గంలో ఎమ్మెల్యే కడుబండికి వ్యతిరేకంగా వర్గాన్ని కూడగట్టే ప్రయత్నాలు చేశారు. వీళ్ల ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో పార్టీ మారిపోతామని చివరి అస్త్రం తీశారు. గత 15 రోజులుగా గ్రామాగ్రామానికి వెళ్లి ‘మేం పార్టీ మారుతున్నాం మాతో వచ్చేయండి. లేకుంటే మీకు ఇబ్బందులు తప్పవు’ అంటూ వైఎస్సార్‌సీపీ శ్రేణులతో బెదిరింపులకు కూడా దిగారు. ఫలితం లేకపోవడంతో తమతో ఎప్పుడూ కలిసొచ్చే కొంతమందితో రఘురాజు భార్య సుబ్బలక్ష్మి సోమవారం ఉండవల్లిలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పచ్చకండువా కప్పుకొని నిస్సిగ్గు రాజకీయాలకు తెరతీశారని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు భగ్గుమంటున్నారు.

ఆది నుంచి ఆధిపత్య పోరే...
శృంగవరపుకోటలో సీనియర్‌ నాయకుడు ఐవీఎన్‌ రాజు మరణం తర్వాత ఆయన పేరు చెప్పుకుని రఘురాజు రాజకీయాల్లోకి వచ్చారు. కానీ తొలి నుంచి ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా వారిపై ఆధిపత్యం కోసం పోరాటం చేయడం అలవాటు చేసుకున్నారు. తొలుత 2004లో కుంభా రవిబాబు ఎమ్మెల్యేగా గెలిచింది మొదలు అతనిపై తిరుగుబాటు జెండా ఎగురేశారు. అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఫలితంగా నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడింది. 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో ధర్మవరం గ్రామానికి చెందిన ఎ.కె.వి.జోగినాయుడును కాంగ్రెస్‌ అభ్యర్థిగా వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రకటించారు. కానీ సొంతపార్టీ అభ్యర్థిని ఓడించడానికి రఘురాజు ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. ఎంత నచ్చజెప్పినా వినకుండా బరిలో నిలిచి నాడు సొంత కాంగ్రెస్‌ పార్టీ ఓటమికి కారణమయ్యారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్‌ను వదిలేసి బీజేపీలో చేరారు. తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల తరుణంలో వైఎస్సార్‌సీపీలోకి చేరారు. తీరా ఇక్కడ కూడా ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా పనిచేస్తూనే వచ్చారు.

ఎన్ని పదవులిచ్చినా అదేతీరు...
మండల స్థాయిలో ఉండే రఘురాజుకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీగా చట్టసభలో స్థానం ఇచ్చింది. ఆయన వర్గీయులనే ఎంపీపీగా, జెడ్పీటీసీగా చేసింది. అతని భార్యకే శృంగవరపుకోట వైస్‌ ఎంపీపీ పదవినీ ఇచ్చింది. ఇంకా ఏదో ‘గౌరవం’ కావాలంటూ రఘురాజు దంపతులిద్దరూ డిమాండు చేస్తూనే వచ్చారు. ఇంత గౌరవం ఇచ్చిన తమ పార్టీకి వెన్నుపోటు పొడిచి, మరే గౌరవం ఆశించి సుబ్బలక్ష్మి టీడీపీలో చేరారని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.

‘కోళ్ల ’ తీరుపై టీడీపీలో ఆందోళన...
మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తీరుపై టీడీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆధిపత్య ధోరణి ప్రదర్శించే రఘురాజు కుటుంబాన్ని పార్టీలో చేర్చుకోవద్దంటూ వ్యతిరేకించారు. కానీ వారి మాట పక్కనపెట్టి ఆమె రఘురాజు భార్య సుబ్బలక్ష్మిని, ఆయన అనుచరులను విజయవాడ తీసుకెళ్లి లోకేష్‌తో పార్టీ కండువాలు వేయించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

‘పదవి’ కోసం పాకులాట...
ఒకే ఇంటిలో ఉంటారు... భార్య టీడీపీ, భర్త మాత్రం వైఎస్సార్‌సీపీ. పదవి కోసం ఇంతలా పాకులాడటం ఎక్కడా చూడలేదని శృంగవరపుకోట నియోజకవర్గ ప్రజలు విస్తుపోతున్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో అభిమానంతో ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని వదిలేయడానికి మాత్రం రఘురాజుకు ఇష్టంలేదు. మరో నాలుగేళ్లూ పదవీకాలాన్ని అనుభవిస్తానని, కానీ ముందు మాత్రం తన భార్య టీడీపీలోకి వెళ్తుందని ఇటీవల ఆయన బహిరంగంగానే వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Advertisement

తప్పక చదవండి

Advertisement