
గరుగుబిల్లి: జవహర్‌లాల్ నెహ్రూ జయంతి(నవంబర్ 14)ను పురస్కరించుకుని నిర్వహించే బాలల దినోత్సవం సందర్భంగా నాగూరుకు చెందిన నఖచిత్రకారుడు పల్ల పరిసినాయుడు గీసిన నెహ్రూ వర్ణచిత్రం చిన్నారులను ఆకట్టుకుంది.
సంబరంగా దీపావళి
పార్వతీపురం: దీపావళి పండగను పార్వతీపురం మన్యం జిల్లా వాసులు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఇంటిళ్లపాదీ కొత్తదుస్తులు ధరించి లక్ష్మీపూజలు జరిపారు. రాత్రి బాణసంచా కాల్చారు. కలెక్టర్ నిషాంత్ కుమార్‌ను పలువురు జిల్లా అధికారులు కలెక్టర్ విడిది గృహంలో కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. జేసీ గోవిందరావు కలెక్టర్‌కు స్వీట్లు తినిపించారు. సంబరాల్లో డీఆర్వో జె.వెంకటరావు, ఆర్డీఓ కె.హేమలత, డీఆర్‌డీఏ పీడీ పి.కిరణ్‌కుమార్, డీఈఓ ఎన్.ప్రేమ్‌కుమార్, తహసీల్దార్ శివన్నారాయణ, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పంట పొటాల్లో ఏనుగులు
గరుగుబిల్లి: మండలంలోని తులసిరామినాయుడువలస పంటపొలాల్లో ఏడు ఏనుగుల గుంపు సోమవారం సంచరించాయి. పంటలకు నష్టం వాటిల్లుతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఏనుగుల తరలింపునకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
బోనులో భల్లూకం
● మరుపల్లి కొండపై బంధించిన అటవీశాఖ సిబ్బంది
మెంటాడ: మండలంలోని మరుపల్లి కొండపై సంచరిస్తున్న ఎలుగుబంటిని అటవీశాఖ సిబ్బంది సోమవారం బంధించారు. వివరాల్లోకి వెళ్తే.. కొండపై ఎలుగుబంటి సంచరిస్తున్నట్టు స్థానిక రైతులు గుర్తించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీశాఖ సిబ్బంది హుటాహుటిన కొండ వద్దకు చేరుకుని తుప్పల్లో చిక్కుకున్న ఎలుగుబంటిని గుర్తించారు. మత్తు ఇంజిక్షన్ ఇచ్చి బోనులో బంధించారు. ఈ సందర్భంగా జిల్లా అటవీశాఖ అధికారి ఎస్.వెంకటేష్ విలేకరులతో మాట్లాడుతూ కొండపై మరికొన్ని ఎలుగుబంట్లు ఉండే అవకాశం ఉందన్నారు. ఆహారం కోసం కొండ కిందకు దిగే క్రమంలో ఎలుగు కాళ్లకు తివ్వ చుట్టకోవడంతో తుప్పల్లో చిక్కుకుందని తెలిపారు. బంధించిన ఎలుగుబంటిని విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జులాజికల్ పార్కుకు తరలించామన్నారు. కార్యక్రమంలో అటవీశాఖ రేంజర్ అప్పలరాజు, డీఆర్వో ప్రహ్లాదరాజు, జూపార్కుకు వైద్యులు ఫణీంద్రతో పాటు పలువురు అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.