జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశం 29న 53 గ్రామ పంచాయతీల్లో పోలింగ్‌కు సన్నాహాలు
నరసరావుపేట: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ఈ నెల 29వ తేదీన పారదర్శకంగా, ప్రశాంతంగా, నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల సన్నద్ధతపై శుక్రవారం వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించి, వారికి పలు సూచనలు చేశారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూముల ఏర్పాట్లు, కమ్యూనికేషన్ ప్లాన్, అవసరమైన వాహనాల సమీకరణపై చర్చించారు. ఎన్నికలకు సంబంధించిన సమాచారం, ఫిర్యాదుల స్వీకరణ, తక్షణ స్పందన కోసం కంట్రోల్ రూమ్‌తో పాటు హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రత్యేక అవసరాలు గల ఓటర్ల సౌకర్యార్థం వీల్‌చైర్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కౌంటింగ్ సమయంలో ప్రతి రౌండ్ ఫలితాలను జాగ్రత్తగా నమోదు చేయాలని, తక్కువ ఓట్ల మెజారిటీ ఉన్న ప్రాంతాల్లో చెల్లని ఓట్ల పరిశీలనపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతి అరగంటకు లేదా గంటకు ఒకసారి ఫలితాల సరళిని సమీక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఐదు మండలాల్లోని 53 గ్రామ పంచాయతీలకు, 540 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. 641 మంది ప్రిసైడింగ్ అధికారులు, 641 మంది ఏపీఓలు, 446 మంది ఇతర పోలింగ్ అధికారులను నియమించినట్లు తెలిపారు. ప్రజలు, ఓటర్లు సహకరించాలని కోరారు. అర్హులైన అందరూ ఓటు హక్కును వినియోగించుకొని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.


