రెండో విడత ప్రచారానికి తెర | - | Sakshi
Sakshi News home page

రెండో విడత ప్రచారానికి తెర

Nov 28 2026 1:56 AM | Updated on Nov 28 2026 1:56 AM

ఓటర్లను ప్రభావితం చేసే పనిలో కూటమి అభ్యర్థులు పంచాయతీల్లో రేపు రెండో విడత పోలింగ్‌కు సన్నద్ధం 52 సర్పంచ్‌ స్థానాలకు బరిలో 142 మంది అభ్యర్థులు

బలంగా వైఎస్సార్‌ సీపీ

సత్తెనపల్లి: జిల్లాలో రెండో విడతలో సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని తొమ్మిది మండలాల్లోని 150 పంచాయతీలకు, 1,562 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పెదకూరపాడు నియోజకవర్గంలోని అమరావతి, అచ్చంపేట, క్రోసూరు, పెదకూరపాడు, బెల్లంకొండ మండలాల్లో 76 పంచాయతీలకు గాను వైఎస్సార్‌ సీపీ బలపరిచిన అభ్యర్థులను నామినేషన్‌లు వేయనివ్వకుండా కూటమి నేతలు అరాచకాలకు పాల్పడ్డారు. దీంతో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. సత్తెనపల్లి ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్‌లు వేసేందుకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయిననప్పటికీ నామినేషన్‌లు వేసేందుకు కూటమి నేతలు అవకాశం ఇవ్వలేదు. కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కి కేవలం 11 పంచాయతీల్లో మాత్రమే వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు నామినేషన్‌లు వేసేలా పోలీసులు సెటిల్‌మెంట్‌ చేశారు. మిగిలిన అన్ని స్థానాలను కూటమి ఏకపక్షంగా ఏకగ్రీవం చేసుకుంది. 9 మండలాల్లో 150 పంచాయతీలకు 98, అలాగే 1,562 వార్డు స్ధానాలకు 1,144 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 52 గ్రామాల సర్పంచ్‌ పదవులకు 142 మంది పోటీ పడుతున్నారు. 1,562 వార్డులకుగాను 1,144 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. క్రోసూరు మండలంలో నాలుగు వార్డుల్లో ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. మిగతా 414 వార్డుల్లో 882 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

చివరి ప్రయత్నాలు..

పోలింగ్‌కు ఒక్క రోజే మిగిలి ఉండడంతో అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు ప్రచారం చేయడంతోపాటు కలిసి మద్దతు కోరడం, విందులతో నడిపించారు. చాలాచోట్ల పోటీ ఎక్కువగా ఉండడంతో అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ఎంతైనా ఖర్చు చేయడానికి వెనుకాడడం లేదు. పలువురు రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. చివరి రోజున ఓటర్లను పూర్తి స్థాయిలో ప్రభావితం చేయడం ద్వారా గట్టెక్కే ప్రయత్నాల్లో ఉన్నారు. పలువురు అప్పులు చేసి మరీ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఓటర్లకు డబ్బులు పంపిణీ, పలు వస్తువులను అందించినట్లు తెలుస్తోంది.

పంచాయతీ ఎన్నికలు కీలకంగా మారాయి. రెండు నియోజకవర్గాలలోనూ ప్రతిపక్షం బలంగా ఉంది. పోటీ తీవ్రంగా ఉంది. పెదకూరపాడు నియోజకవర్గంలో దౌర్జన్యాలు, దాడులు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. మునుపెన్నడూ లేని కొత్త సంస్కృతిని కూటమి నేతలు, పోలీసులు తీసుకొచ్చారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో కొన్ని పంచాయతీల్లో కూటమి అభ్యర్థులపై ఆ పార్టీ రెబల్స్‌ పోటీలో ఉన్నారు. హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. మెజారిటీ పంచాయతీలను కై వసం చేసుకుని సత్తా చాటాలన్న లక్ష్యంతో వైఎస్సార్‌ సీపీ ఉంది. గ్రామీణ స్థాయిలో బలమైన క్యాడర్‌ ఉన్నందున నేతలు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. వార్డు సభ్యుల పదవులకు సైతం అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నారు. కొందరు ఉప సర్పంచ్‌ పదవిపై కన్నేసిన వార్డు సభ్యులు తాము గెలవడంతో పాటు తమకు అనుకూలమైన వ్యక్తులను బరిలో దింపి గెలిపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ముందుగానే కొందరికి ఎన్నికల ఖర్చు పెడుతున్నారు. సర్పంచ్‌ పదవులు రిజర్వేషన్లు అనుకూలించకపోవడంతో చాలా మంది ఉపసర్పంచ్‌ పీఠంపై కన్నేసి ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండో విడత ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల భవితవ్యం ఆదివారం తేలనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement