గడువు ముగిసినా తుది జాబితా ప్రకటించరా? | - | Sakshi
Sakshi News home page

గడువు ముగిసినా తుది జాబితా ప్రకటించరా?

Nov 28 2026 1:56 AM | Updated on Nov 28 2026 1:56 AM

గడువు ముగిసినా తుది జాబితా ప్రకటించరా?

మాజీ మంత్రి విడదల రజిని

చిలకలూరిపేట: పంచాయతీ ఎన్నికల పేరుతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ఎన్నికల నిబంధనలను అధికారులే తుంగలో తొక్కుతున్నారని మాజీ మంత్రి విడదల రజిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు మధ్యాహ్నం 3 గంటలకే ముగిసినా, సాయంత్రం 6:30 గంటలు దాటినప్పటికీ చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎక్కడా అభ్యర్థుల తుది జాబితా ప్రకటించకపోవడం, ఎన్నికల గుర్తులు కేటాయించకపోవడంపై సమాచారం తెలుసుకున్న విడదల రజిని నేరుగా చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలోని నామినేషన్‌ కేంద్రానికి చేరుకుని అధికారులను నిలదీశారు. ఉపసంహరణల గడువు మధ్యాహ్నం 3 గంటలకే ముగిసినా, సాయంత్రం 6:30 గంటలు దాటినా నియోజకవర్గంలో ఎక్కడా అభ్యర్థుల తుది జాబితా ప్రకటించలేదు.. ఎన్నికల గుర్తులు కేటాయించలేదు. ఎన్నికల ప్రక్రియను నిబంధనల ప్రకారం నిర్వహించాల్సిన అధికారులు ఎందుకంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? ఎవరి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు? అని ప్రశ్నించారు. ఎన్నికల నిబంధనల్లోని రూల్‌ 14, 15 లను స్పష్టంగా చదువుకోవాలన్నారు. ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత ఎన్నికల ప్రక్రియను నిబంధనల ప్రకారం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులపై లేదా? నిబంధనలు అమలు చేయాల్సిన అధికారులే వాటిని ఉల్లంఘిస్తే ప్రజాస్వామ్యానికి విలువ ఏముంటుందని ప్రశ్నించారు. ఒకవైపు గడువు ముగిసినా అభ్యర్థుల తుది జాబితా ప్రకటించకుండా, ఎన్నికల గుర్తులు కేటాయించకుండా అధికారులు కాలయాపన చేస్తుంటే.. మరోవైపు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను పోలీసులతో బెదిరిస్తూ, నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు. అధికారికంగా గడువు ముగిసిన తర్వాత కూడా ఎన్నికల ప్రక్రియను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నా యని, అధికారుల ఈ మౌనం దేనికి సంకేతమని నిలదీశారు.

ఇవేం ఎన్నికలు.. ?

చిలకలూరిపేట మున్సిపల్‌ ఎన్నికల సమయంలోనూ ఇదే తరహా వ్యవహారాలు చోటుచేసుకున్నాయని గుర్తుచేశారు. ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత కూడా అర్ధరాత్రి వరకు ఉపసంహరణలు కొనసాగించి 16 మంది అభ్యర్థులను ఉపసంహరింపజేశారని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం యంత్రాంగం పనిచేస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. కలెక్టర్‌కు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అధికారులు అధికార పార్టీకి దాసోహమై పనిచేస్తుంటే, ఎన్నికల కమిషన్‌ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. ఎన్నికలు ప్రజల తీర్పును గౌరవించడానికి జరగాలి తప్ప, అధికార పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఫలితాలను ప్రభావితం చేయడానికి కాదన్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువులు, ఎన్నికల నిబంధనలు, అభ్యర్థుల హక్కులు అన్నీ అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement